కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండచరియల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఘటనాస్థలంలో కేంద్ర సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వీటికి ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కొండచరియల కారణంగా మలప్పురం - వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా కార్మికులను రక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, సిద్దిఖీ వయనాడ్‌కు బయల్దేరారు.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో వయనాడ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గత 2024లోనూ కొండచరియలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు ముండక్కై, చూర్‌మాలా ప్రాంతాల్లో బండరాళ్లు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

