Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్‌'పై కేసు నమోదు

11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్‌'పై కేసు నమోదు

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌ ఏఐ'పై కేసు నమోదైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్(Grok) చాట్‌బాట్‌ సాయంతో అభ్యంతరకరమైన కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు..

బాలల లైంగిక వేధింపులకు గురైన ఓ బాధితురాలి పాత ఫొటోలను ఉపయోగించారని ఓ అమెరికన్ మహిళ ఆరోపించారు. తర్వాత ఆ కంటెంట్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారన్నారు. ఈ మేరకు కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారామె. బాధితురాలికి సంబంధించిన చిత్రాలను గ్రోక్ అభ్యంతరకర రీతిలో రూపొందించిందని, దీనిని కెనడియన్ సెంటర్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ కూడా గుర్తించిందని పేర్కొన్నారు. ఈ కేసులో జ్యూరీ విచారణ చేపట్టాలనీ ఆమె డిమాండ్ చేశారు.

కాగా.. గతంలో లైంగిక వేధింపులకు గురై ప్రాణాలతో బయటపడిన ఆమెను 2000 ఏడాది ప్రారంభంలో యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ తొలిసారిగా గుర్తించింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు సుమారు 20 ఏళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. గ్రోక్‌ సాయంతో ఆమె అభ్యంతరకర చిత్రాలను సృష్టించడం ఇటీవల ఒక్కసారిగా పెరిగిందని అమెరికన్ మహిళ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. ముఖ్యంగా గత డిసెంబర్‌ చివర్లో ఎలాన్ మస్క్ తనను బికినీలో చూపించమని గ్రోక్‌ను కోరిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందని ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8తో ముగిసిన 11 రోజుల్లో గ్రోక్ ద్వారా 30 లక్షలకుపైగా ఈ తరహా కంటెంట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటిలో 23 వేలకుపైగా చిత్రాలు పిల్లలను పోలి ఉన్నాయని ఆరోపించారు.

ఈ వివాదం అనంతరం ఎక్స్ ఏఐ.. తన కంటెంట్ క్రియేట్ సదుపాయాన్ని పూర్తిగా ఆపకుండా సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే పరిమితం చేసిందని ఆమె ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, మెటా వంటి పలు సంస్థలు ఇలాంటి రిక్వెస్ట్‌లను సాధారణంగా నిరోధిస్తున్నాయన్నారు. గ్రోక్ వీడియో టూల్‌లో 'స్పైసీ మోడ్'ను మార్కెటింగ్ చేయడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. యూఎస్‌లోని ఓ ప్రత్యేక న్యాయ చట్టం కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టం ద్వారా ఫెడరల్ బాలల అశ్లీలత నేరాల బాధితులకు ప్రతి ఉల్లంఘనపై కనీసం 1.5 లక్షల డాలర్ల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ ఆరోపణలపై ఎక్స్ ఏఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనా లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy