Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న

ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ సర్ ప్రక్రియలో భాగంగా లాజికల్ డిస్క్రిపెన్సీస్ కేటగిరీ కింద ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులపై సుప్రీం కోర్టు ఈసీపై పలు ప్రశ్నలు సంధించింది.

ఏ ప్రాతిపదికన ఈ నోటీసులు జారీ చేస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. ఈ కేటగిరీపై స్పష్టత ఇవ్వాలని చెప్పింది. సర్ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఈసీని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

ఢిల్లీ సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సర్ ప్రక్రియ కింద ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసుల్లో స్పష్టమైన కారణాలు పేర్కొనట్లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్నారు. ఏ ప్రాతిపదికన ఓటర్లకు లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీ కింద నోటీసులు జారీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటర్ల నుంచి ఏయే పత్రాలు, వివరాలను ఈసీ ఆశిస్తున్నదో కూడా స్పష్టత లేదని అన్నారు. సాధారణ ఓటర్ల వద్ద పరిమితమైన డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయని చెప్పారు. చాలామంది దగ్గర ప్రాథమిక వివరాలున్న ప్రధాన డాక్యుమెంట్‌గా ఆదార్ కార్డు మాత్రమే ఉంటోందని చెప్పారు.

ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా ప్రజలు అప్పటికే వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో మళ్లీ అదనపు వివరాల నిర్ధారణకు డాక్యుమెంట్స్ ఎందుకు సమర్పించాలని ప్రశ్నించారు. నివాసం మార్పు పేరిట ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి అనేక మంది పేర్లు తొలగించారని చెప్పారు. ఇందుకు అనుసరించిన పద్ధతిపై సందేహాలు లేవనెత్తారు.

ఈ విషయాలపై ఈసీ తరఫున సీనియర్ అడ్వొకేట్ డీఎస్ నాయుడు వాదనలు వినిపించారు. ప్రతి నోటీసుకు వెనక గల కారణాన్ని ఈసీ పేర్కొంటుందని ఆయన చెప్పారు. పిటిషనర్లు లెవనెత్తున్న అంశాలు వారు భావిస్తున్నంత తీవ్రమైనవి కావని అన్నారు. మరోవైపు సర్ ప్రక్రియ డెడ్‌లైన్‌ను అవసరమనుకుంటే పొడిగించేందుకు ఈసీ సుముఖంగానే ఉందని కూడా చెప్పారు. చట్టంలో పేర్కొన్న ప్రక్రియకు భిన్నంగా ఒక్కరి ఓటు కూడా తొలగించబోమని హామీ ఇచ్చారు. ఓటర్ల సహాయం కోసం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశామని కూడా చెప్పారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు స్పందిస్తూ నోటీసులు జారీ చేస్తున్న విధానంపై ఈసీని వివరణ కోరింది. యాంత్రికంగా నోటీసులు జారీ అవుతున్నాయా? అని ప్రశ్నించింది. నోటీసులకు గలకారణాలను ఈసీ ఓటర్లకు తగిన విధంగా అందిస్తోందా? అని ప్రశ్నించింది. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే ఏంటో వివరించాలని కూడా చీఫ్ జస్టిస్ ఈసీని కోరారు. అసలు ఈ కేటగిరీలో నోటీసులు ఎలా జారీ చేస్తున్నారనే విషయంలో స్పష్టత ఇవ్వాలని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

'డాక్టర్ నా కళ్లను తీసేశారు'.. పిల్లలను భయపెట్టిన పాఠశాల కార్యక్రమం

యూపీఐ పేమెంట్స్‌పై కేంద్రం క్లారిటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy