ఢిల్లీ, సెప్టెంబర్ 22: యూపీఐ(UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధింపునకు సంబంధించిన ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది.
దీనిపై ఎలాంటి అపోహలు వద్దని వెల్లడించింది. చిరు వ్యాపారులపై ఎలాంటి అదనపు భారం ఉండదన్న కేంద్రం.. రూ.2 వేల వరకు ఉన్న మర్చంట్ పేపెంట్స్‌కూ ఎండీఆర్ పూర్తిగా జీరో అని పేర్కొంది. జీఎస్టీ భారం కూడా ఉండదని స్పష్టం చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మెజారిటీ డిజిటల్ చెల్లింపులకు MDR వర్తించదని వెల్లడించింది.
MDRపై వ్యాపారి చెల్లించిన జీఎస్టీను ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా.. అమ్మకాలపై చెల్లించాల్సిన GST నుంచి సర్దుబాటు చేసుకోవచ్చని ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది కేంద్రం. నెలకు లక్ష రూపాయిల వరకు UPI రశీదులు పొందే వ్యాపారులకు ఎండీఆర్ ఉండదని స్పష్టం చేసింది. వారికి MDRపై GST సమస్య కూడా ఉండదని వివరించింది. UPI చెల్లింపులు ఖరీదవుతాయన్న వాదనలు తప్పుదారి పట్టించేవేనని పేర్కొంది. దీనివల్ల మెజారిటీ లావాదేవీలు, చిరు వ్యాపారులు ప్రభావితం కారని వివరణ ఇచ్చింది.

