Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్యానికి పార్లమెంట్‌ అత్యున్నత దేవాలయమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఇటీవల జరుగుతున్న ఆందోళనలు, అంతరాయాలతో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సభ సజావుగా సాగాలని, ప్రతి సభ్యుడూ తన అభిప్రాయాలను వెల్లడించేందుకు అవకాశమివ్వాలన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్‌డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌ చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. అందులోని చర్చలు, సమాచారాన్ని తెలుసుకుని తమ ప్రసంగాలను ప్రభావవంతంగా కొనసాగించాలని కోరారు. దేశాభివృద్ధి అనేది రాష్ట్రాల ప్రగతిపైనే ఆధారపడి ఉంటుందన్న ప్రధాని.. ప్రతీ ఎంపీ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆయా పురోగతి పనులకు సంబంధించి అవసరమైతే నేరుగా తన కార్యాలయాన్ని(పీఎంఓ) సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. పేదలు, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలతో ఎంపీలు కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు.

ఈ సమావేశానికి శివసేన నుంచి ఏడుగురు, ఎన్‌సీపీఐ తరఫున 20 మంది, ఎన్‌సీపీ(అజిత్‌ పవార్‌ వర్గం) నుంచి ఇద్దరు సహా మొత్తం సుమారు 45 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇటీవల టీఎంసీని వీడి ఎన్‌డీఏలో చేరిన ఎంపీలు, అలాగే ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నుంచి బయటకు వచ్చి ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో చేరిన మాజీ శివసేన ఎంపీలకు ప్రధాని ప్రత్యేక భరోసానిచ్చారు. 'ఎన్‌డీఏ అనేది ఓ కుటుంబం. ఈ కూటమిలోని ప్రతి పార్టీకి చెందిన ఎంపీకి సమానమైన గౌరవం ఉంటుంది. నేను ఒక పార్టీకి మాత్రమే కాదు.. ప్రతి ఎంపీకి అండగా ఉంటాను. ఇందులో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు' అని మోదీ చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఒక్కో ఎంపీతో విడివిడిగా మాట్లాడిన మోదీ.. వారి వారి నియోజకవర్గాల పరిస్థితులు, అక్కడి ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

అంతకుముందు రోజు కూడా తన నివాసంలో బీజేపీకి చెందిన 37 మంది ఎంపీలతో విందు నిర్వహించారు మోదీ. పాలన, పార్లమెంటు వ్యవహారాలు, ప్రజా సేవలపై వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే ఢిల్లీలోని రాజకీయ ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని, ప్రతిపక్ష సభ్యులతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని ఎంపీలకు మోదీ సూచించినట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ఇలా చేసినందుకు మా అమ్మకు కోపం వస్తుందేమో: రాహుల్ గాంధీ

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy