Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇలా చేసినందుకు మా అమ్మకు కోపం వస్తుందేమో: రాహుల్ గాంధీ

ఇలా చేసినందుకు మా అమ్మకు కోపం వస్తుందేమో: రాహుల్ గాంధీ

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా జెన్ జీతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన తల్లి సోనియా గాంధీ పెంపుడు కుక్క నూరీని జనాలకు పరిచయం చేశారు.

పెంపుడు జంతువులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆస్క్ మీ ఎనీథింగ్ పోల్ సందర్భంగా జెన్ జీ యువతతో రాహుల్ ముచ్చటించారు.

'జెన్ జీ, విద్యార్థులు నన్ను ఏమైనా అడగండి.. నాకు వీలైనంత వరకూ సమాధానాలు ఇస్తా' అని రాహుల్ అన్నారు. పెంపుడు కుక్కతో పాటు రాహుల్ కనిపించడంతో సంభాషణ సహజంగానే వాటిపై మళ్లింది. ఓ నెటిజన్ మాట్లాడుతూ డాగ్ పేరెంట్‌గా మీకు బాగా నచ్చిన విషయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి రాహుల్ స్పందిస్తూ తనని తాను డాగ్ పేరెంట్‌గా భావించనని స్పష్టం చేశారు.

తనతో పాటు ఉన్న కుక్క పేరు నూరీ అని, అది తన తల్లి సోనియా గాంధీ పెంపుడు శునకమని రాహుల్ చెప్పారు.'నేను డాగ్ పేరెంట్‌ని కాను. ఎందుకంటే.. మనతో పాటు కలిసి ఈ భూమ్మిద ఇతర జీవాలు ఉంటున్నాయని నేను విశ్వసిస్తాను. అవి మన సొంతం కాదు. వాటితో మనం గౌరవంగా, ఆప్యాయంగా ఉండాలని నమ్ముతాను' అని అన్నారు. ఆ తరువాత నూరీ వైపు తిరిగి నీ అభిప్రాయం ఇదేగా అని సరదాగా కామెంట్ చేశారు. నూరీని ఇలా కెమెరా ముందుకు తెచ్చినందుకు తన తల్లికి కోపం రావచ్చని కూడా అన్నారు. అయితే, సమస్యను తరువాత హ్యాండిల్ చేసుకుంటానంటూ చమత్కరించారు. జాక్ రసెల్ టెరియర్ జాతికి చెందిన నూరీని రాహుల్ గాంధీ 2023లో ఉత్తర గోవా నుంచి తీసుకొచ్చారు.

ఇటీవల కాలంలో అనేక మంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, పెంపుడు జంతువులను తమ కన్నబిడ్డల్లా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తాము పెట్ పేరెంట్స్‌ అంటూ కనిపించిన వారికల్లా మురిసిపోతూ చెప్పుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy