ఇంటర్‌నెట్ డెస్క్: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా 16 లక్షల రూపాయలు దోచేశారు.
ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళూరుకు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలు గత ఏప్రిల్ నెలలో ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ పెట్టుబడులకు సంబంధించిన పోస్టును చూసింది. అందులోని లింక్‌ను క్లిక్ చేసి ఓ టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయింది.
కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి వృద్ధురాలికి ఫోన్ చేశాడు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన వృద్ధురాలు ఏప్రిల్ 18వ తేదీన 20 వేల రూపాయలు పంపింది. ఆ తర్వాత జూన్ 12వ తేదీన మూడు లక్షల రూపాయలు.. జున్ 22వ తేదీన మరో 3 లక్షల రూపాయలు.. జూన్ 24వ తేదీన 4 లక్షల రూపాయలు..
జూన్ 30వ తేదీన 6 లక్షల రూపాయలు.. మొత్తం 16 లక్షల రూపాయలు ఆ వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు పంపింది. రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోవటంతో వృద్ధురాలికి అనుమానం వచ్చింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగింది. డబ్బులు తిరిగిరాకపోవటంతో మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు మంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
>

