Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!

ఆర్సీబీ ధురంధర్.. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ రజత్ పాటీదార్!

ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ ఉన్న ఫ్రాంచైజీ. జట్టు నిండా స్టార్ ప్లేయర్లే.. అయినప్పటికీ ఆర్సీబీ కప్పు అందుకోవాలన్న కల 17 సీజన్ల పాటు కలగానే ఉండిపోయింది.

17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఆర్సీబీ.. హిస్టరీని రిపీట్ చేసింది. వరుసగా రెండోసారి సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ వంటి స్టార్ ప్లేయర్లు కెప్టెన్‌లుగా వ్యవహరించినప్పటికీ రెండేళ్ల క్రితం వరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. ఇంత మంది స్టార్ ప్లేయర్లు సాధించలేనిది.. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని రజత్ పాటీదార్ చేసి చూపించాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తొలి సీజన్‌లో ఆర్సీబీకి తొలి కప్పు అందించాడు. ఒక్కటి గెలవడమే ఎక్కువంటే వరుసగా రెండోసారి టైటిల్ అందించాడు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు రజత్‌కు కొత్త పేరు పెట్టారు.. అదే 'ఆర్సీబీ ధురంధర్'!

ఆర్సీబీ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ఆరంభం నుంచి అదే జట్టుకు ఆడుతూ ఆ ఫ్రాంచైజీకి కోహ్లీ తీసుకొచ్చిన ఆకర్షణే వేరు. ఈ సీజన్‌లోనూ అత్యుత్తమంగా రాణించిన విరాట్.. ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. కానీ విరాట్ కూడా చేయలేనిది రజత్ చేసి చూపించాడు. రజత్ పాటీదార్.. 2022లో రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు.. అదే ఏడాదిలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. 2024 వరకు అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అనూహ్యంగా 2025లో ఆర్సీబీ జట్టు పగ్గాలు అందుకున్న రజత్.. అదే ఏడాది జట్టుకు ట్రోఫీని అందించాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా బెంగళూరు జట్టును ఎంతో ప్రమాదకరంగా తీర్చిదిద్దాడు. రజత్‌కు స్టార్‌ ఇమేజ్‌ లేదు. తన గురించి సోషల్‌ మీడియాలో పెద్దగా చర్చ జరగదు. మైదానంలో, బయట అతను కూడా పెద్దగా హడావుడి చేయడు. కానీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రశాంతంగా పని చేసుకుపోతూ ఆర్సీబీని మేటి జట్టుగా నిలబెట్టాడు.

ఐపీఎల్ కెరీర్ గణాంకాలివీ..

6 ఇన్నింగ్స్‌లు.. 338 పరుగులు.. 112.66 సగటు.. 193.14 స్ట్రైక్‌ రేట్‌.. ఇదీ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో రజత్‌ రికార్డు. ప్లే ఆఫ్స్‌లో శతకం సాధించిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 44.18 సగటుతో 486 పరుగులు చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌ రేట్‌ 196.76 కావడం విశేషం. మొత్తంగా ఐపీఎల్‌లో 56 మ్యాచ్‌లాడిన రజత్.. 33.98 సగటుతో 1597 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్, దేశవాళీల్లో రాణించడంతో రజత్ పాటీదార్‌కు 2023లోనే టీమిండియా నుంచి పిలుపొచ్చింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు. దీంతో వేటు పడింది. ఇప్పుడు కెప్టెన్‌గానూ రాణిస్తుండటంతో తిరిగి అతడిని టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 17 ఏళ్లలో జరగనిది.. వచ్చిన తొలి ఏడాదే చేసి చూపించాడు రజత్. ఆర్సీబీ తొలిసారి కప్పు నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 'డిఫెండింగ్' కాదు 'అటాకింగ్ ఛాంపియన్స్' అంటూ.. చెప్పి మరీ కప్పు కొట్టారు. రెండోసారి ట్రోఫీ అందుకున్న ఆ అర్థరాత్రే కెప్టెన్ బర్త్ డే కావడం విశేషం.. 'నమ్మ ఆర్సీబీ హోస్సా నాయకా'(ఆర్సీబీ అభిమానుల పాలిట దేవుడు) రజత్ పాటీదార్‌కు హ్యాపీ బర్త్ డే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy