Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదానీకి భారీ ఊరట

అదానీకి భారీ ఊరట

అమెరికాలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ అభియోగాల కొట్టివేత

వాషింగ్టన్‌, ఆగస్టు 11: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి భారీ ఊరట. సౌరవిద్యుత్‌ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ఆయన, ఆయన బంధువు సాగర్‌ అదానీ, మరికొందరు కలిసి 2024లో భారత్‌లో అధికారులకు 250 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2300 కోట్ల) దాకా లంచాలు చెల్లించారంటూ అమెరికాలో దాఖలైన క్రిమినల్‌ అభియోగాలను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ నికొలస్‌ గరాఫిస్‌ కొట్టివేశారు.

అదానీపై నమోదైన ఈ అభియోగాలను ఉపసంహరించుకోవాలన్న అమెరికా న్యాయశాఖ (డోజ్‌) అభ్యర్థనను ఆమోదించారు. అయితే.. న్యాయశాఖ ఈ నిర్ణయానికి వచ్చిన తీరును మాత్రం న్యాయమూర్తి తీవ్రంగా విమర్శించారు. డోజ్‌లోని కీలక అధికారి ఆర్‌ ట్రెంట్‌ మెక్‌కాటర్‌.. ఈ కేసుకు సంబంధించిన ప్రాసిక్యూటర్లను, ఇన్వెస్టిగేటర్లను సంప్రదించకుండా అదానీ లాయర్లతో కలిసి కేసు కొట్టివేత దిశగా పనిచేశారని.. ఇది అత్యంత అసాధారణమని వ్యాఖ్యానించారు. ''న్యాయశాఖ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక ఉన్న క్రమరాహిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి'' అని తీర్పులో రాశారు. కాగా.. తనపై అభియోగాలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు అదానీ ప్రకటించారు. న్యాయప్రక్రియ గౌరవంతో కోర్టు నిర్ణయాన్ని స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ నేపథ్యం..

గౌతమ్‌ అదానీ, మరికొందరు కలిసి భారత్‌లో అధికారులకు లంచాలు ఇచ్చి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు పొందిన సమయంలోనే.. అదానీకి చెందిన గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి 175 మిలియన్‌ డాలర్ల దాకా పెట్టుబడులు సమీకరించింది. అలా సమీకరించేటప్పుడు.. 'మా సంస్థ లంచాలు ఇవ్వదు. అవినీతి నిరోధక చట్టాలను కచ్చితంగా పాటిస్తుంది' అని ఇన్వెస్టర్లకు తెలిపింది. అది పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంటూ అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అదానీపై అభియోగాలు బైడెన్‌ హయాంలో నమోదు కాగా.. 2024లో ట్రంప్‌ గెలిచాక.. అమెరికాలో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి, 15 వేల ఉద్యోగాలు కల్పిస్తానని నవంబరు 13న అదానీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ కేసులో తన తరఫున వాదనలు వినిపించేందుకు రాబర్ట్‌ జే గిఫ్రా జూనియర్‌ అనే న్యాయవాది నేతృత్వంలోని న్యాయబృందాన్ని నియమించుకున్నారు. ఆయన డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యక్తిగత న్యాయవాది కావడం గమనార్హం. అదానీ ఆయన్ను నియమించుకున్నాక.. అమెరికా ప్రభుత్వ స్వరంలో మార్పు వచ్చింది. ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలంటూ డోజ్‌ ఈ ఏడాది మేలో కోర్టును అభ్యర్థించింది. ఇదంతా అమెరికా వెలుపల జరిగిన వ్యవహారమని, అందువల్ల ఈ కేసును విచారించడం కష్టమని, దాన్ని కొనసాగించడం న్యాయశాఖ ప్రాధాన్యాలకు అనుగుణం కాదని వాదించింది. కానీ జడ్జి గరాఫిస్‌ ఆ అభ్యర్థనను తొలుత తోసిపుచ్చారు. కానీ, 'పఫరీ(కంపెనీలు చెప్పుకొనే గొప్పలు)' కారణం కేసును కొట్టివేయడానికి సరిపోతుందని భావించి.. అభియోగాలను శాశ్వతంగా (విత్‌ ప్రిజుడిస్‌) కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో.. అదానీకి చెందిన గ్రీన్‌ ఎనర్జీ సంస్థ తమ సంస్థ లంచాలు ఇవ్వదని చెప్పుకోవడం పఫరీయేనని, దాన్ని పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోరనే కోణంలోనే జడ్జి ఈ తీర్పునిచ్చారు.

trong>

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy