Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారంలోకి వస్తామని జగన్ అండ్ కో పగటి కలలు కంటున్నారు.. ధూళిపాళ్ల సెటైర్లు

అధికారంలోకి వస్తామని జగన్ అండ్ కో పగటి కలలు కంటున్నారు.. ధూళిపాళ్ల సెటైర్లు

గుంటూరు జిల్లా, మే 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (TDP MLA Dhulipalla Narendra Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పని అని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో బడుగువర్గాలపై దాడులు చేశారని ఆరోపించారు. ఈరోజు (సోమవారం) గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక చర్యలతోనే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని దుయ్యబట్టారు.

వైసీపీ నేతల్లో మార్పు రాలేదు..

ప్రజల తీర్పు చూసిన తర్వాత కూడా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఫైర్ అయ్యారు. వివాదాలు సృష్టించి యువతను పలు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో మళ్లీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. జడ్జిలు, వాళ్ల కుటుంబసభ్యులపైనా కూడా దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. జగన్ అండ్ కో మాట వినలేదని అనేకమందిని హత్య చేశారని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇవ్వలేదనే అక్కసుతోనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా డ్రామాలు ఆడటమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని సెటైర్లు గుప్పించారు.

ప్రభుత్వాలపై ఆధారపడి మేము వ్యాపారం చేయట్లేదు..

మొక్కజొన్న రైతన్నలకు న్యాయం చేయాలని అడిగితే తప్పు లేదని.. కానీ రైతుల పేరుతో దీక్ష పెట్టి తనపై, సంగం డెయిరీపై వైసీపీ నేతలు విమర్శలు చేశారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. గత 15 ఏళ్లుగా డెయిరీ అవసరాల కోసం మొక్కజొన్న కొంటున్నామని ప్రస్తావించారు. ప్రభుత్వాలపై ఆధారపడి తాము వ్యాపారం చేయటం లేదని స్పష్టం చేశారు. మొక్కజొన్న కొనాలంటే కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మొక్కజొన్న త్వరగా కొనాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని చెప్పుకొచ్చారు. జగన్ రాజకీయ లబ్ధి కోసం అన్నదాతలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. మహిళలను రోడ్లపైకి రెచ్చగొట్టి పంపించి వారిపై కేసులకు కారణం అయ్యారని అన్నారు. అంబటి మురళి తన రాజకీయ అవసరాల కోసం మహిళలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy