అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తమ భూభాగంలో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో పలువురు సాధారణ పౌరులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ వెల్లడించింది.
అందులో చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలిపింది. అఫ్గాన్‌లోని పౌరుల నివాసాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు చేసిందని తాలిబన్ అధికారులు ఆరోపించారు (Pakistan airstrikes on Afghanistan).
సరిహద్దుకు సమీపంలోని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్‌లలోని పౌరుల నివాసాలపై మంగళవారం అర్ధరాత్రి పాక్ బాంబు దాడులు చేసిందని అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు (Afghanistan civilians killed). ఈ దాడిలో మొత్తం 11 మంది చిన్నారులతో పాటు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మృతి చెందినట్టు తెలిపారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. అయితే ఈ దాడుల గురించి ఇప్పటివరకు పాక్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

