Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు సీఎస్కేలో కీలక మార్పు!

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు సీఎస్కేలో కీలక మార్పు!

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఆరంభంలో వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్.. క్రమంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది.

గత మూడు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తోన్న సీఎస్కే.. 11 మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిన తరుణంలో సీఎస్కే జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికే వరుస గాయాలతో ఇబ్బందులు పడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బీసీసీఐ అనుమతి కోసం ఫ్రాంచైజీ ఎదురుచూస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రామకృష్ణ ఘోష్ తీవ్రంగా గాయపడ్డాడు. అదే అతడికి ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో కుడి పాదానికి తీవ్రంగా గాయమైంది. స్కానింగ్‌లో ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో అతడు జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. 'రామకృష్ణ ఘోష్‌ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయింది. అతడు ఇక ఈ సీజన్‌లో ఆడబోడు. త్వరగా కోలుకో రాంబో' అంటూ సీఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎవరీ నోరోన్హా..?

రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల ఆల్‌రౌండర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను చెన్నై ఒప్పందం చేసుకుంది. గతేడాది మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరఫున అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 253 పరుగులు చేశాడు. అందులో 19 సిక్సర్లు ఉన్నాయి. అలాగే 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం కర్ణాటక జట్టులో చోటు సంపాదించాడు. ఇప్పటికే గాయం కారణంగా సీఎస్కే ప్లేయర్లు ఖలీల్ అహ్మద్, ఆయుశ్ మాత్రే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు కండరాల గాయంతో ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీ రసవత్తరంగా మారుతోన్న సమయంలో సీఎస్కే జట్టు కూర్పు మరింత బలహీనపడింది. ఇది జట్టు విజయంపై ప్రభావం చూపుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy