ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రవాసంలో ఉన్నంత కాలం కలిసిమెలిసి ఉండే సమాజం అదే ఉద్యోగం ఊడిపోయినా లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కనీసం కన్నెత్తి కూడా చూడదు.
ఇలాంటి నేపథ్యంలో ప్రవాసంలో తమలో ఒకరిగా ఉంటూ ఆ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన ఒక ప్రవాసీయుడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారు సౌదీ అరేబియాలోని ఈశాన్య ప్రాంత ప్రవాసాంధ్రులు. ఇటీవల ఆయన అకస్మాత్తుగా మరణిస్తే ఆయనకు సామూహిక శ్రద్ధాంజలిని ఘటించారు.
సౌదీ అరేబియాలోని అల్ హాస్సా ప్రాంతంలో వైద్యుడిగా పని చేసిన సానికొమ్ము సురేశ్ ఈశాన్య ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయుల సాంస్కృతిక, సేవా కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనే వారు. ఈ ప్రాంతంలో తెలుగు వారి వేదిక అయిన సాటా సంఘం కార్యకలాపాల్లో ముఖ్యభూమిక వహించే సురేశ్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినా సాటా, దమ్మాం, హాస్సాలలోని తెలుగు వారందరికీ స్వదేశంలో ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేవారు. ఆయన ఇటీవల విజయవాడ నగరంలో కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు.
డాక్టర్ సురేశ్ మృతి ఈ ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయులను కలచివేసింది. దీంతో అల్ హాస్సా పట్టణంలో ఆయన స్మారక సభను సాటా నిర్వహించింది. ఈ సందర్భంగా సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేషన్, ఈశాన్య ప్రాంత అధ్యక్షులు తేజ పల్లెం మాట్లాడుతూ సురేశ్ నిస్వార్థ సేవలు ఎల్లప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. కట్టా శ్రీనివాస్, శ్రీకాంత్, హరీష్ బొబ్బా, రామిరెడ్డి తదితరులు డా.సురేశ్ సేవాభావాన్ని గుర్తు చేసుకోంటూ నివాళులు ఆర్పించారు.

