Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్

అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు ఆడి చరిత్ర సృష్టించాడు.

ఐర్లాండ్ సిరీస్ నాటి నుంచి అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో రెండో టీ20కి ముందు తిలక్ వర్మ చేతి నుంచి క్యాప్ అందుకుని.. సంజు శాంసన్ స్థానంలో ఓపెనర్‌గా వైభవ్ బరిలోకి దిగాడు. 10 బంతుల్లో 2 సిక్స్‌లతో మొత్తం 14 పరుగులు చేసి ఔటయ్యాడు. తన అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతోంది.

'నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా ప్రయాణంలో నాపై ప్రేమ, నమ్మకం ఉంచిన అందరికీ రుణపడి ఉంటాను. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణం. ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారీ నా వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తాను' అని వైభవ్ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు అతడికి అభినందనలు తెలియజేస్తూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా 15 ఏళ్ల వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేసి సచిన్ టెండూల్కర్, షఫాలీ వర్మ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసు డెబ్యూ రికార్డును వైభవ్ అధిగమించాడు.

ముందు నాన్నకే చెప్పా: వైభవ్ సూర్యవంశీ

మ్యాచ్‌కు ముందు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్‌ భారత జట్టు క్యాప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైభవ్ బీసీసీఐతో మాట్లాడాడు. 'భారత్‌ తరఫున ఆడటం ప్రతి భారతీయ క్రికెటర్ కల. ఈ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. క్యాప్ అందుకున్న వెంటనే నా గదికి వెళ్లి ముందుగా నాన్నకు చెప్పాను. ఆయన నా వెంటనే ఉన్నారు. ఆ తర్వాతే అమ్మకు, నా కోచ్ రోమి సర్‌కు సమాచారం ఇచ్చాను. నాన్న చాలా సంతోషించారు. ఒత్తిడి గురించి ఆలోచించొద్దని, ఇప్పటివరకు ఎలా ఆడావో అలాగే నీ ఆటను నమ్ముకుని కొనసాగాలని సూచించారు' అని వైభవ్ తెలిపాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy