Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు కర్ణ్ శర్మ వీడ్కోలు

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ, భారత దేశవాళీ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

38 ఏళ్ల కర్ణ్ శర్మ.. యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్‌స్టార్స్, మీరట్ మావెరిక్స్ మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆగస్టు 25న లఖ్‌నవూ లెగ్‌ జట్టు ఆడే చివరి మ్యాచ్‌తో ఆటగాడిగా కెరీర్‌కు పూర్తిగా ముగింపు పలకనున్నాడు.

'ఇప్పుడు నేను రిటైర్ కావాలనుకుంటున్నాను. నా ప్రయాణంలో అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్, యూపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇకపై క్రికెట్‌కు సంబంధించిన కోచింగ్, ఇతర బాధ్యతలకు అందుబాటులో ఉంటాను' అని కర్ణ్ శర్మ తెలిపాడు.

దాదాపు రెండు దశాబ్దాల కెరీర్

2007-08 దేశవాళీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 క్రికెట్ అరంగేట్రం చేసిన కర్ణ్.. తొలినాళ్లలో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. అయితే 2012-13 సీజన్ అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు బీసీసీఐ బెస్ట్ అండర్-25 క్రికెటర్ అవార్డును అందుకున్నాడు. అనంతరం ఐపీఎల్‌లోనూ మంచి అవకాశం దక్కింది. 2014 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కర్ణ్ శర్మను రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాడిగా నిలిచాడు.

టీమిండియా తరఫున..

దేశవాళీ, ఐపీఎల్ ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన కర్ణ్.. 2014 ఇంగ్లండ్ పర్యటనకు భారత పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి టీ20 మ్యాచ్‌లో జో రూట్‌ను ఔట్ చేసి.. టీమిండియా తరఫున తన ఏకైక టీ20 వికెట్ సాధించాడు. అదే ఏడాది శ్రీలంక పర్యటనలో వన్డే అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ 264 పరుగులు చేసిన చారిత్రాత్మక మ్యాచ్‌లో కర్ణ్ ఆడటం విశేషం. ఆ సిరీస్‌లో మరో వన్డే కూడా ఆడాడు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండేసి వికెట్లు తీసి మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. అదే అతడి ఏకైక టెస్టుగా మిగిలిపోయింది. 2015లో జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ భారత జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ కర్ణ్ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017-18లో విదర్భ, 2018-19లో ఆంధ్ర తరఫున ఆడిన అనంతరం తిరిగి రైల్వేస్ జట్టులో చేరాడు. అతడి చివరి ఐపీఎల్ మ్యాచ్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున జరిగింది.

strong>

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: ట్రీసా-గాయత్రి జోడీకి కాంస్యం

అండర్ 20 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy