Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ చీఫ్ చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో భారీ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను బట్టబయలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేమింగ్ మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది నిర్వాహకులను అధికారులు అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కరీంనగర్‌ డాఫా బెట్ కేసును ఛేదించాం: సీఐడీ చీఫ్ చారుసిన్హా

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని సీఐడీ చీఫ్ చారుసిన్హా వ్యాఖ్యానించారు. సీఐడీకి బదిలీ అయిన ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసు పూర్తి వివరాలను చారుసిన్హా మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌లో నమోదైన డాఫా బెట్ కేసును ఛేదించామని తెలిపారు. 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్‌ను సీజ్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా ఆర్గనైజర్లు రోజుకు రూ.8 నుంచి రూ.10 లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు. 40 మంది అధికారులు ఈ కేసును విచారణ చేశారని వెల్లడించారు. 15 రోజుల సీఐడీ ఆపరేషన్‌లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో 11 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బెట్టింగ్ దందా అని తెలిపారు.

414 కేసులు నమోదు చేశాం..

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేసి నిందితులను అరెస్ట్ చేశామని చారుసిన్హా వివరించారు. ఈ డాఫా బెట్‌పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 108 ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌లను గుర్తించి కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో 37 ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉండేలా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను.. కౌన్సెలింగ్ చేశామని అన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుకు.. ఒక ఛాన్స్ ఇచ్చామని చెప్పారు. వారికి కౌన్సెలింగ్ చేశామని, మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో 414 కేసులు నమోదు చేశామని, 108 బెట్టింగ్ యాప్‌లు బ్లాక్ చేశామని సీఐడీ చీఫ్ చారుసిన్హా పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy