Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..

భార్య, ఇద్దరు పూజారులను చంపేశాడు.. ఎన్‌కౌంటర్‌లో మరణించాడు..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వరుస హత్యల ఘటన విషాదాంతమైంది. భార్యతో పాటు ఇద్దరు పూజారులను హత్య చేసిన, తన ముగ్గురు పిల్లలను గదిలో బంధించిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

సుమారు ఏడు గంటల పాటు కొనసాగిన పోలీసు ఆపరేషన్‌లో ఎదురుకాల్పులు జరగడంతో నిందితుడు అరవింద్ సింగ్ మృతి చెందాడు. ఈ ఘటనలో అతడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు (UP Triple killing).

ఆజంగఢ్‌లోని శంభూపుర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అరవింద్ సింగ్ సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. అప్పటికే అతడి భార్య బబితా సింగ్ ఇంట్లో ఇద్దరు పూజారులతో కలిసి మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సమయంలో అరవింద్‌కు భార్య, పూజారులతో వాగ్వాదం జరిగింది. దీంతో తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో అరవింద్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతడి భార్య బబితా సింగ్‌తో పాటు పూజారులు మహేంద్ర పాఠక్, అఖిలేశ్ మిశ్రా మృతి చెందారు (Azamgarh Encounter).

ముగ్గురిపై కాల్పులు జరిపిన అనంతరం అరవింద్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు అరవింద్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా అతడిని లొంగిపోవాలని కోరారు. అరవింద్ లొంగిపోవడానికి నిరాకరించాడు (UP Crime News).

చివరకు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. పోలసుల ఎదురుకాల్పుల్లో అరవింద్, అతడి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. అరవింద్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాసేపటి తర్వాత అతడి కుమారుడు కూడా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో అరవింద్ ఇద్దరు కుమార్తెలు సురక్షితంగా బయటపడ్డారు. పూజా కార్యక్రమం సమయంలో జరిగిన వాగ్వాదమే కాల్పులకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy