Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో కీలకమైన వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భువీ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఛేజింగ్‌లో దాదాపు ఓటమి ఖాయమనుకున్న ధశలో భారీ సిక్సర్ బాది జట్టు విజయ సమీకరణాన్ని తేలిక చేశాడు. అటు బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. అయితే భువీ చాలాకాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

'ఇది భువనేశ్వర్ కుమార్ రోజు. ఇది అతడి టోర్నమెంట్. ముంబైతో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి.. కీలక దశలో ఓ సిక్సర్ కూడా బాదాడు. భువీ రాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అందుబాటులో ఉన్న ప్రతిసారీ దేశవాళీ క్రికెట్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎక్స్‌లో #BringBackBhuvi అని ఎప్పుడెప్పుడు ట్రెండింగ్ అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. టీమిండియాలో చోటు కోసం అతడిని పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. కొత్త బంతితో పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు. డెత్ ఓవర్లలోనూ నిలకడగా బౌలింగ్ చేస్తాడు. అవసరమైతే, అతడు ఒత్తిడిలో కూడా సిక్స్ కొట్టగలడు' అని అశ్విన్ వివరించాడు.

మ్యాచ్ అక్కడే ముగిసింది: క్రిస్ శ్రీకాంత్

'ముంబైతో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాత భువీని తలపించే ప్రదర్శన అది. అతడు రెండో ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించేశాడు. తొలి ఓవర్‌లో రికెల్టన్‌ను ఔట్ చేశాడు. తన రెండో ఓవర్‌లో నకుల్ బాల్‌తో రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేశాడు. ఆ దెబ్బతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకురండి' అని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy