Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనాలో కొత్త విధానం.. ఉద్యోగులకు ఏటా 10 రోజుల 'అన్‌హ్యాపీ లీవ్స్'

చైనాలో కొత్త విధానం.. ఉద్యోగులకు ఏటా 10 రోజుల 'అన్‌హ్యాపీ లీవ్స్'

ఇంటర్నెట్ డెస్క్: పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న వేళ.. చైనాలోని పాంగ్ డాంగ్ లై అనే ప్రముఖ రిటైల్‌ సంస్థ తీసుకొచ్చిన వినూత్న విధానం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఉద్యోగులు తమకు అన్‌హ్యాపీగా ఉందనిపిస్తే.. పనికి రావాల్సిన అవసరం లేదు! ఇందుకోసం వారికి ఏడాది కాలంలో 10 రోజుల వరకు ప్రత్యేకమైన 'అన్‌హ్యాపీ లీవ్స్'ను తీసుకొచ్చింది. ఆ కంపెనీ వ్యవస్థాపకులు యూ డోంగ్‌లై ఆలోచన కూడా అదేనట. 'మనసు బాగాలేకపోతే పనికి రావాల్సిన అవసరం లేదు' అనే ఆయన.. ఇందుకోసం ఉద్యోగి అన్‌హ్యాపీ లీవ్‌ కోసం అప్లై చేస్తే మేనేజర్లు దానిని తిరస్కరించకూడదనే నిబంధనా ఉన్నట్లు సమాచారం.

ఈ వినూత్న విధానం ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఆయన 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. 'భారతీయ సంస్థల్లోనూ ఇలాంటి విధానం అవసరమా? చైనాలోని పాంగ్‌ డాంగ్‌ లై సంస్థ ఉద్యోగులకు 10 రోజుల పాటు వేతనంతో కూడిన 'అన్‌హ్యాపీ లీవ్స్' ఇస్తోంది. అంటే సంతోషంగా లేకపోతే ఆఫీస్‌కు రాకూడదనేది ఆ ఫౌండర్ ఆలోచన. ఇది అతిగా అనిపించొచ్చు. కానీ భారత్‌లోనూ ఈ విధానం అవసరమా అనే దానిపై విస్తృత చర్చ జరగాలి. లేదంటే ఉద్యోగులు బర్నౌట్‌ కాకుండా.. వారు సంతోషంగా పనిచేయాలనుకునే వాతావరణాన్ని సృష్టించడమే మెరుగైన మార్గమా?' అని గోయెంకా ప్రశ్నించారు.

హర్ష్‌ గోయెంకా పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు మానసికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకునేందుకు అవకాశమిస్తే.. అది వారి ఆరోగ్యంతో పాటు సంస్థ ఉత్పాదకతకూ సహకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 'ఉదయం లేవగానే మానసికంగా బాగాలేకపోయినా, పనిపై దృష్టి పెట్టలేమనిపించినా.. మేనేజర్‌, హెచ్‌ఆర్‌కు ఇన్ఫర్మ్ చేసి లీవ్ తీసుకునే వెసులుబాటు ఇప్పటికే మా కంపెనీలో ఉంది. దీనికి ప్రత్యేకమైన విధానమేమీ అక్కర్లేదు' అని ఓ ఉద్యోగి అన్నారు.

అయితే.. ఏడాదికి 10 రోజులు అదనంగా సెలవులు ఇచ్చినంత మాత్రాన బర్నౌట్‌ పోదు. మిగిలిన రోజుల్లో ఉద్యోగులు అలసిపోయేలా పనిచేస్తే ప్రయోజనమేంటి? సరైన పని గంటలు, ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవించే మేనేజర్లు కావాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరికొందరు మాత్రం 'అన్‌హ్యాపీ లీవ్‌' కంటే ముందు 'అన్‌హ్యాపీ అవర్స్‌ తీసుకురావాలి' అని సరదాగా స్పందించారు. మొత్తంగా.. చైనా కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సెలవు విధానం కొత్త చర్చకు తెరతీసినట్టైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy