స్పోర్ట్స్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ సకిబ్ హుస్సేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ భారత బౌలర్‌కు సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక సీజన్‌లో తొలి 10 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వికెట్ తీయడంతో సకిబ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా ఈ బిహార్ కుర్రాడి కంటే ముందు ఫిల్ఫెన్హాస్ (13 వికెట్లు), ఎంగిడి (13) ఈ ఘనత సాధించారు.
ఈ సీజన్‌లో ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ బిహార్ కుర్రాడు.. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు సాధించి అదిరిపోయే ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ సాధించిన విజయాల్లో సకిబ్ కీలకపాత్ర పోషించాడు. యార్కర్లు, స్లో బాల్స్‌తో చెలరేగిపోయే ఈ నయా పేస్ సెన్సేషన్.. ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం సాధించినా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైన ఎలిమినేటర్ గండాన్ని దాటాల్సి ఉంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

