Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

చెన్నైలో జరిగిన ఓ అత్యంత భయానక, సంచలన హత్య కేసు వివరాలిప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఓ నటిని ఆమె భర్తే అతి కిరాతకంగా హతమార్చి, శరీరాన్ని ముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ హత్య కేసును మృతురాలి చేతిపై ఉన్న రెండు చిన్న టాటూల ఆధారంగా ఛేదించారు పోలీసులు. ఈ దారుణ హత్య వెనక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఇంకా ఒక విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.

వెలుగులోకి వచ్చిందిలా..

అది 2019 జనవరి. చెన్నైలోని పళ్లికరనై డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ ప్లాస్టిక్ సంచిలో మనుషుల వేళ్లు బయటపడటంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా.. తెగిపడిన కాళ్లు, చేయి కనిపించాయి. ఆ తర్వాత నగరంలోని ఓ నది పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్లాస్టిక్ సంచులు మరికొన్ని లభ్యమయ్యాయి. వాటిలో ఎముకలు, అంతర్గత అవయవాలు వంటివి ఉన్నాయి. అయితే.. మృతురాలిని గుర్తించేందుకు వీలుగా తల, ఎడమ చేయి మాత్రం కనిపించలేదు.

ఈ కేసును పోలీసులు ఛేదించారు కానీ ఆమె తలను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ మృతదేహం ఆమెదేనని కచ్చితంగా నిర్ధారించేందుకు ముఖం లేకుండా పోయింది. కొన్ని మిస్సింగ్ కేసులతో పోల్చిచూసినా సరైన పోలిక లేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. పళ్లికరనై డంపింగ్ యార్డ్‌లో ఏకంగా 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టారు. అయినప్పటికీ తల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆ విషయం మిస్టరీగానే ఉండిపోయింది.

పోలీసులకు దొరికిన కుడి చేతిపై 2 ప్రత్యేకమైన టాటూలను గుర్తించారు. వాటిలో శివపార్వతుల రూపం ఒకటి కాగా, మరొకటి డ్రాగన్. ఇదే సమయంలో తూత్తుకుడికి చెందిన ఓ మహిళ తన కూతురు 3 వారాలుగా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన ఆమే చెన్నైలో నివసించే 37 ఏళ్ల నటి సంధ్యగా తేలింది. దీంతో ఆ మృతదేహాన్ని తల్లి పరిశీలించి.. చేతిపై ఉన్న టాటూలు, గాజుల ఆధారంగా ఆమె తన కూతురేనని గుర్తించారు. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె చెప్పింది నిజమేనని తేలింది.

భర్తే నరికి చంపి..

ఈ కేసుకు సంబంధించి సంధ్య భర్త, సినీ నిర్మాత అయిన బాలకృష్ణన్‌ను పోలీసులు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. సంధ్య తూత్తుకుడికి బయలుదేరిందని చెప్పినప్పటికీ.. ఆమె అక్కడకు చేరుకోలేదు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజాన్ని కక్కాడు బాలకృష్ణన్. సంధ్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పుకొచ్చాడు. అలా 2019 జనవరిలో జరిగిన ఘర్షణతో.. ఓ రోజు రాత్రి ఆమెను గొడ్డలితో నరికి హత్యచేసినట్టు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ సంచుల్లో వేసి పలు ప్రాంతాల్లో పడేసినట్టు వివరించాడు. దీంతో పోలీసులు నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టి, సీసీటీవీ కెమెరాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy