హైదరాబాద్, ఫిబ్రవరి 19: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. నార్సింగి పరిధి ప్రాంతానికి చెందిన బాలికకు గంజాయి తాగించి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఈరోజు రిమాండ్‌కు తరలించనున్నారని తెలుస్తోంది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కాగా.. మరొకరు రౌడీ షీటర్ అని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక తన అమ్మమ్మతో కలిసి స్థానికంగా నివసిస్తోంది.
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆమె 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం పాఠశాలకు వెళ్తున్నట్లు ఆ బాలిక ఇంట్లో చెప్పింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో బాలిక అమ్మమ్మ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థులను ఆరా తీశారు. వారు చెప్పిన ఆధారాలతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఆ బాలికకు గంజాయి, మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు గుర్తించారు.
ఇక నిందితులు సైతం మద్యం తాగినట్లు గుర్తించారు పోలీసులు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లగా పోలీసులు గుర్తించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ముగ్గురిలో ఒక యువకుడు స్థానిక భవానీ నగర్‌లో రౌడీ షీటర్ అని పోలీసులు వివరించారు.

