ద్వేషం, దురభిమానం ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనిషికి నష్టం కలిగిస్తాయి. కాబట్టి వాటి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని దైవ ప్రవక్త మహమ్మద్ హెచ్చరించారు.
''దౌర్జన్యకరమైన ప్రవర్తన ప్రళయ దినాన దౌర్జన్యపరుడికి అంధకారంగా మారుతుంది. పీడితుడు తన హక్కుగా రావలసినవి ఇప్పించాల్సిందిగా దైవానికి మొరపెట్టుకుంటాడు. హక్కు కలిగిన ఎవరికీ దాన్ని ఇప్పించకుండా దేవుడు ఉండడు. కాబట్టి తోటివారిని పీడించేవారు బాధితుల శాపాలకు, ఆర్తనాదాలకు భయపడాల్సిందే'' అని ఆయన స్పష్టం చేశారు. ''దేవుడు దౌర్జన్యాలను హద్దులు మీరేవరకూ సహిస్తాడు. చివరకు మాత్రం దౌర్జన్యపరుణ్ణి శిక్షించకుండా వదిలి పెట్టడు. దేవుడి పట్టు చాలా కఠినంగా ఉంటుంది'' అని దివ్య గ్రంథమైన 'ఖురాన్'లో అల్లాహ్ పేర్కొన్నాడు.
ఒక వ్యక్తి దుర్గార్గుడని తెలిసి కూడా అతణ్ణి ఎవరైనా సమర్థిస్తే... అటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టేననీ, తన సన్నిహితులు, తన వర్గం వారు అధర్మానికి, అక్రమానికి పాల్పడినప్పుడు... పక్షపాతంతో వారికి సహకరించేవాడు బావిలో పడిపోతున్న ఒంటె తోక పట్టుకొని, దానితోపాటు బావిలో పడిపోయే మూర్ఖుడు లాంటి వాడనీ 'హదీసు గ్రంథం' చెబుతోంది. దురభిమానం వైపు మనల్ని ఆహ్వానించేవాడు, దురభిమానంతో యుద్ధాలు చేసేవాడు, మరణించేవరకూ దురభిమానంతో రగిలిపోయేవాడు మనవాడు కాదని గుర్తించాలని కూడా హితవు చెబుతోంది. ద్వేషం, దురభిమానం మనిషి హృదయంలో ఒకసారి తిష్టవేస్తే ఒక పట్టాన వదిలి వెళ్ళవు. క్రమంగా అవి ప్రతీకారేచ్ఛగా మారుతాయి. హింసకు, అఘాయిత్యాలకు దారి తీస్తాయి. మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉండాలన్నా, దేవుడి అనుగ్రహం పొందాలన్నా వాటిని తక్షణం విడిచిపెట్టాలి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలను కూడా చదవండి

