Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈజిప్టుపై అర్జెంటీనా అద్భుత విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న మెస్సి!

ఈజిప్టుపై అర్జెంటీనా అద్భుత విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న మెస్సి!

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026.. ప్రిక్వార్టర్స్‌లో అత్యంత కీలకమైన పోరు.. ప్రత్యర్థి బలమైన ఈజిప్టు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి..

ఈ టోర్నీలో జోరు మీదున్న అర్జెంటీనా సునాయసంగా గెలిచేస్తుందనే అనుకున్నారంతా! కానీ 79వ నిమిషం వరకు అర్జెంటీనా ఒక్క గోల్ చేయలేదు. అప్పటికే ఈజిప్టు 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక మెస్సి కథ కూడా ముగిసిపోయిందని అనుకునేలోపు.. అద్భుతమే జరిగింది. ఆఖరి 11 నిమిషాల్లో అర్జెంటీనా జట్టు 3 గోల్స్ చేసి ఈజిప్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఉత్కంఠ పోరులో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మొన్న కాబో వెర్ట్‌.. నేడు ఈజిప్టు జట్లు.. అర్జెంటీనాకు గట్టి పోటీనే ఇచ్చాయి. ఇంకేముంది ఓడిపోతామనుకున్న మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన మెస్సికి.. కన్నీళ్లు ఆగలేదు. మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈజిప్ట్‌కు యాసర్ ఇబ్రహీం తొలి గోల్‌తో ఆధిక్యం అందించాడు. కొద్దిసేపటికే అర్జెంటీనాకు పెనాల్టీ లభించినా, మెస్సి కొట్టిన షాట్‌ను గోల్‌ కీపర్ మోస్తఫా షోబీర్ అద్భుతంగా అడ్డుకోవడంతో అర్జెంటీనా నిరాశలో మునిగింది. అనంతరం షోబీర్ పలుమార్లు అద్భుత సేవ్‌లు చేస్తూ అర్జెంటీనా దాడులను అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో మొస్తఫా జికో గోల్ చేసినా, వీఏఆర్ జోక్యంతో అది రద్దైంది. అయితే కొద్దిసేపటికే మరో వేగవంతమైన కౌంటర్ అటాక్‌లో జికో మరోసారి గోల్ చేసి ఈజిప్ట్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా నిష్క్రమణ ఖాయమేనని అందరూ భావించారు. కానీ 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడ్డర్‌తో అర్జెంటీనా ఆశలు మళ్లీ చిగురించాయి. 83వ నిమిషంలో మెస్సి హాఫ్ వాలీతో అద్భుత గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేశాడు. అదనపు సమయంలో (92వ నిమిషం) లౌటారో మార్టినెజ్ ఇచ్చిన క్రాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ బుల్లెట్ హెడ్డర్‌గా మలచడంతో అర్జెంటీనా సంచలన విజయాన్ని అందుకుంది. విజయానంతరం సహచర ఆటగాళ్లను ఆలింగనం చేసుకున్న మెస్సి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా క్వార్టర్‌ఫైనల్ చేరిన అర్జెంటీనా తదుపరి దశలో కొలంబియా-స్విట్జర్లాండ్ విజేతతో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy