Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

పంజాబ్‌: ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం, ఆత్మహత్యకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రచారంతో విద్యార్థులు ఆందోళనకు దిగగా.. పరిస్థితి క్రమంగా హింసాత్మకంగా మారింది. క్యాంపస్‌లో ఆస్తుల విధ్వంసంతో పాటు జాతీయ రహదారి-44ను విద్యార్థులు దిగ్బంధించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో బాలికల హాస్టల్-3 సమీపంలో నిరసనలు ప్రారంభమైనట్లు ఓ విద్యార్థి తెలిపాడు. సోషల్ మీడియా మాధ్యమం రెడిట్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగిందని, రెండు రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని సందేశం వచ్చిందని పేర్కొన్నాడు. దీంతో న్యాయం కోరుతూ శాంతియుత నిరసన చేపట్టామని చెప్పాడు. అయితే పోలీసులు అప్పటివరకు అలాంటి అత్యాచార ఫిర్యాదును ధృవీకరించలేదు.

ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో క్యాంపస్‌లో విద్యార్థులు అద్దాలను ధ్వంసం చేయగా.. కొన్ని వస్తువులకు నిప్పంటించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో కొందరు ముఖాలకు మాస్కులు ధరించగా.. ఓ వ్యక్తి క్యాంపస్‌లోని మిగ్-23యూఎం విమానంపైకి ఎక్కిన దృశ్యాలు కనిపించాయి. మరికొంత మంది ఇనుప రాడ్లతో విధ్వంసం సృష్టించారు. జాతీయ రహదారి 44ని దాదాపు 15 గంటలకు పైగా దిగ్బంధించారు. అయితే, ఈ హింసలో పాల్గొన్న వారిలో బయటి వ్యక్తులు ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హింసకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ గౌరవ్ యాదవ్ క్యాంపస్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఉన్నతస్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

ఇక అత్యాచార ఆరోపణలను ఎల్‌పీయూ యాజమాన్యం ఖండించింది. అవి నిరాధారమైన, కల్పిత ఆరోపణలని పేర్కొంది. అయితే యూనివర్సిటీ విడుదల చేసిన వీడియోలో కనిపించిన ముగ్గురు విద్యార్థినులు తమ అనుమతి లేకుండా వీడియోను ఉపయోగించారని చెప్పడం కలకలం రేపింది. 'మేము 504 నంబర్ గదిలో ఉండే విద్యార్థులం. మా గదిలో అలాంటిదేమీ జరగలేదు. మేము గత రెండు నెలలుగా ఈ గదిలోనే ఉంటున్నాము. దయచేసి, విద్యార్థులు, పోలీసులు మమ్మల్ని వేధించడానికి రావద్దు' అని వాళ్లు చెప్పిన వీడియోను యూనివర్సిటీ పోస్టు చేసింది.

అయితే, తమకు అలా మాట్లాడమని చెప్పారని, అందుకే మాట్లాడాల్సి వచ్చిందని విద్యార్థులు మరో వీడియోను విడుదల చేయడం వివాదానికి దారితీసింది. కాగా, యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్‌లో భద్రతను కట్టుదిట్టం చేయగా, తరగతులను 10 రోజుల పాటు నిలిపివేశారు. ఈ ఆందోళనతో పలువురు విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు.

ఈ వార్తలు కూడా చదవండి

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy