Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమిరేట్స్‌లో వైభవంగా జగన్నాథుడి  రథ యాత్ర

ఎమిరేట్స్‌లో వైభవంగా జగన్నాథుడి రథ యాత్ర

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: సాధారణంగా భక్తులే ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు కానీ సాక్షాత్తు దేవుడే భక్తుల మధ్యకు వచ్చి దివ్య దర్శనం ప్రసాదించే పవిత్ర సందర్భమే పూరీ జగన్నాథ రథయాత్ర.

భక్తి, ధర్మం, సమానత్వానికి ప్రతీకగా నిర్వహించే మహోన్నత ఆధ్యాత్మిక వేడుక అయిన పూరీ జగన్నాథ రథయాత్ర దేశం వెలుపల కూడా వైభవంగా జరుగుతుంది. అమెరికా, ఐరోపాలలో మాత్రమే వైభవంగా జరిగిన రథయాత్ర చక్రాలు ఇప్పుడు అరబ్బు గల్ఫ్ దేశాలలో కూడా భక్తి పారవశ్యంతో ముందుకు కదులుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈసారి జరిగిన జగన్నాథ రథయాత్ర భక్తకోటి నిరాజనం అందుకుంది.

రాస్ అల్ ఖైమాలోని ప్రవాసీ సంఘం తెలుగు తరంగిణి ఇస్కాన్ సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన పూరీ జగన్నాథ యాత్రలో దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్ల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పసుపు రంగు వస్త్రంతో వచ్చిన జగన్నాథుడి రథాన్ని చూసి ప్రవాసీ భక్తులు భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాల్చారు. రథాల ఎత్తు, చక్రాల సంఖ్య, అలంకరణలన్నీ శాస్ర్తోక్తంగా వేద పండితుల మార్గదర్శకత్వంలో జరిగినట్లుగా యాత్ర ముఖ్య నిర్వహకులలో ఒకరైన తెలుగు తరంగిణి అధ్యక్షుడు వక్కలగడ్డ వెంకట సురేష్ వెల్లడించారు.

కార్యక్రమంలో ఇస్కాన్ దామోదర దేశ్ యాత్రా నాయకులు శ్రీవల్లభ దాస్, సీతా చారు దేవి దాసి, మురళీ చరణ్ దాస్, పాలక జగన్నాథ ప్రభుజీ భక్తులకు ప్రవచనాలు బోధించారు. వివిధ ఎమిరేట్ల నుంచి భక్తజన సందోహంతో జగన్నాథ రథయాత్ర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల జయజయధ్వానాలు, హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణలతో పరిసరాలన్నీ భక్తిమయంగా మారాయి. తెలుగు తరంగిణి ప్రతినిధులు సి.హెచ్. శ్రీనివాసరావు, కిరణ్, బ్రహ్మానందరావు, కేదార్, ప్రసాద్, రవి, శివానంద్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన భార్గవి, కరిష్మా తమ వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

దుబాయ్‌లో అత్యున్నత భారతీయ అధికారిగా విష్ణువర్ధన్ రెడ్డి

తెలంగాణ గ్రామీణాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలి: మంత్రి సీతక్క

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy