Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్

ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ప్రిక్వార్టర్స్‌లో పరాగ్వేపై జరిగిన పోరులో ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ ఎంబాపె ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ క్రమంలో ప్రపంచ కప్ టోర్నీలో 19 గోల్స్ చేసి.. మెస్సి రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండ్ గిల్‌.. ఎంబాపెపై ఆగ్రహంతో బంతిని విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రిక్వార్టర్ పోరులో ఫ్రాన్స్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మ్యాచ్ మొత్తం పరాగ్వే కట్టుదిట్టమైన ఆటతో ఫ్రాన్స్‌కు గట్టి పోటీనిచ్చింది. తరచూ ఫౌల్స్ చేస్తూ గేమ్ లయను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అయితే 70వ నిమిషంలో డిజైర్ డూఏ చేసిన అద్భుత పరుగును అడ్డుకునే క్రమంలో డియెగో గోమెజ్ ఫౌల్ చేయడంతో తొలుత రిఫరీ ఆట కొనసాగించినా, వీఏఆర్ సమీక్ష అనంతరం పెనాల్టీ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఎంబాపె చక్కగా సద్వినియోగం చేసుకుని ఏకైక గోల్ నమోదు చేశాడు. మ్యాచ్ అనంతరం పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్.. ఎంబాపెకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాగా ఎంబాపె విజయోత్సవాల్లో మునిగిపోయి అతడిని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన గిల్.. ఎంబాపె వైపు బంతిని విసిరాడు.

అదే నా ఉద్దేశం: ఓర్లాండో గిల్

మ్యాచ్ తర్వాత తన ప్రవర్తనపై ఓర్లాండో గిల్ స్పందించాడు. 'ఎంబాపెను అభినందించేందుకే చేయి చాచాను. కానీ అతడు పట్టించుకోలేదు. ఆ క్షణంలో కోపంతో బంతిని విసిరాను. ఆ తర్వాత శాంతించాను. ఎంబాపెను అభినందించాలనేదే నా ఉద్దేశం. అతడిపై నాకేమీ కోపం లేదు' అని వివరణ ఇచ్చాడు. క్వార్టర్‌ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడనుండగా.. పరాగ్వే మాత్రం ఈ ప్రపంచ కప్‌లో ప్రశంసనీయ ప్రదర్శనతో టోర్నీకి వీడ్కోలు పలికింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy