Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

ఢిల్లీ, జూన్11, (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు (గురువారం) ఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. నీతి ఆయోగ్ వేదికగా కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పైసలు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కులసర్వే (SEEEPC) వివరాలను ప్రస్తావించారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం, అధికారులైనా వచ్చి తెలంగాణలో తాము కడుతున్న 'యంగ్ ఇండియా స్కూల్స్' చూడాలని సూచించారు. సంతోషంగా తాము దగ్గరుండి చూపిస్తామని పేర్కొన్నారు.

'ఎం-6 టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలి..

దేశ ఆర్థికాభివృద్ధికి ఇంజిన్లుగా ఉన్న టాప్-6 నగరాల కోసం రూ.6 లక్షల కోట్లతో 'ఎం-6 టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని పీఎంవోకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే.. విద్య, ఆరోగ్యమే దానికి బలమైన పునాది అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యం నెరవేరాలంటే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందాలని సూచించారు. తెలంగాణ కులసర్వేలో భూమి, డబ్బు కంటే విద్యే సామాజిక వెనుకబాటుకు కారణమని తేలిందని అన్నారు. కులాల మధ్య గోడలు కూల్చేందుకే ప్రతి నియోజకవర్గంలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేందుకే 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. స్కిల్స్ యూనివర్సిటీ నిర్వహణలో ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు భాగస్వామ్యంగా ఉన్నాయని వెల్లడించారు.

ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నాం..

టాటా గ్రూప్ సహకారంతో రూ.2,100 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 'తెలంగాణ రైజింగ్' విజన్- 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్లు.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌కు ఐఐఎం (IIM) రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణకు అంతర్జాతీయ వర్సిటీలు.. హైదరాబాద్‌లో 'యూనివర్సిటీ ఆఫ్ లండన్' ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని చెప్పుకొచ్చారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధికి 'ఎం-6 టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ 6 ప్రధాన నగరాల మౌలిక వసతుల కోసం ఒక్కో నగరానికి రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేంద్రం ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగ్ రోడ్, మెట్రోఫేజ్-2, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సూచించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

.

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy