Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీని తగ్గించి, సరఫరాను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతోఈరోజు (మంగళవారం) విశాఖపట్నం వేదికగా సీఎం అత్యవసర టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

తక్షణ చర్యలు చేపట్టాలి..

పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ ప్రక్రియ కొనసాగిందని, బంకులకు ఇంధన సరఫరా నిరంతరం జరిగేలా పర్యవేక్షిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి 1402 లోడ్లను వివిధ ప్రాంతాలకు డిస్పాచ్ చేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నిన్న అర్ధరాత్రి నుంచి నేటి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2173 లీటర్ల పెట్రోల్, 2846 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు.

బంకుల వద్ద పరిస్థితులపై సీఎం ఆరా..

రాష్ట్రంలో స్టాక్ లేని బంకుల సంఖ్యపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని అధికారులు సమాధానమిచ్చారు. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి రాష్ట్రవ్యాప్తంగా 432 బంకుల్లో మాత్రమే స్టాక్ కొరత ఉందని, మిగిలిన అన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని అధికారులు స్పష్టం చేశారు.

జనం ఇబ్బంది పడకుండా చూడాలి: సీఎం చంద్రబాబు

పెట్రోల్ బంకుల వద్ద జనం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం సూచించారు. సరఫరా పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరే వరకు నిమిషం కూడా విడవకుండా మానిటర్ చేయాలని ఆదేశించారు. బంకుల వద్ద భారీ క్యూలైన్లు లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే టోకెన్ లేదా స్లాట్ సిస్టంలను అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy