అమరావతి, నవంబర్ 24: రాజకీయ అవసరాల కోసమే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ 'హే రామ్' అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు.
మంగళవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రామతీర్థం విగ్రహ ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధం, వెండి సింహాల చోరీ జరిగినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా? అంటూ వైఎస్ జగన్‌కు చురకలంటించారు. రాజకీయ లబ్ధి కోసం అవసరాన్ని బట్టి మతాలను వాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని అభివర్ణించారు. కాదంబరి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహాల తొలగింపుపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
హిందూ మత విశ్వాసం లేని కరుణాకర్ రెడ్డిని గతంలో టీటీడీ చైర్మన్ చేసి హిందూ ధర్మాన్ని దెబ్బతీశారంటూ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాదంబరి ఆలయ విషయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే కరుణాకర్ రెడ్డి కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. 2023 అక్టోబర్‌లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే నేషనల్ హైవే కోసం ఈ ఆలయ స్థలాన్ని సేకరించారని గుర్తు చేశారు. హైవే పనుల వల్ల గ్రామస్తులు, అధికారుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో విగ్రహాన్ని తాత్కాలిక గదిలోకి మార్చారని వివరించారు.
గతంలో శ్రీశైలం, విజయవాడ ఆలయాల్లో కుట్రలు చేసినట్లే మళ్లీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించబోమని వైసీపీ నేతలకు బుచ్చి రాంప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. ఇది పాత కాలం కాదు.. ప్రతిదానికీ పక్కా ఆధారాలు ఉన్నాయని ఈ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలంటూ భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన హితవు పలికారు. భక్తి లేకుండా రాజకీయ స్వార్థం కోసం దేవుడి పేరు వాడుకుంటే 2024లో 11 సీట్లకు పరిమితమైనట్లే, భవిష్యత్తులో సున్నాకు పడిపోతాయంటూ వైసీపీ నేతలను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్విమ్మింగ్ పూల్‌లో గిలగిల తన్నుకుంటున్న చిన్నారి.. ఇంతలో ఏం జరిగిందంటే.. వీడియో వైరల్
వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలకు బాధ్యులెవరు?: మంత్రి ఆనం

