Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జల ప్రళయం.. వందలాది మంది బలి

జల ప్రళయం.. వందలాది మంది బలి

  • మానససరోవర్‌ యాత్రలో మహా విషాదం

  • టిబెట్‌ ఎగువన బద్దలైన హిమనీనదం.. విరుచుకుపడిన కొండచరియలు

  • నేపాల్‌లో భోటేకోశి, త్రిశూల్‌ నదుల ఉగ్రరూపం.. గ్రామాల్ని సమాధి చేసిన బురద, బండలు

  • ఆచూకీ లేని వందలాది యాత్రికులు.. 403 మంది విదేశీ పర్యాటకుల గల్లంతు

  • ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు.. 77 మంది 'ఈషా' భక్త బృందం

  • జగ్గీవాసుదేవ్‌, డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ సతీ్‌షరెడ్డికి తప్పిన ముప్పు.. యూపీ, బిహార్‌లో హైఅలర్ట్‌

  • ఉగ్రరూపం దాల్చిన గండక్‌ నది.. సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తమైన అధికారులు

  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి.. నేపాల్‌కు విమానంలో సహాయక సామగ్రి

ఖాట్మండు, న్యూఢిల్లీ, ఆగస్టు 26: కళ్లు మూసి తెరిచేలోపే కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న అమాయక ప్రజలను ఐదంతస్తుల ఎత్తున విరుచుకుపడ్డ రాకాసి వరదనీటి అలలు తన్నుకుపోయాయి. ఎక్కడి వారు అక్కడే.. జలసమాధి అయ్యారు. హిమాలయాల ఒడిలో ఉన్న నేపాలీ గ్రామాలను క్షణాల్లోనే శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టేసిన మహా విపత్తు ఇది. కనీవినీ ఎరుగని ఈ జల ప్రళయం అటు చైనాలోని టిబెట్‌, ఇటు నేపాల్‌ సరిహద్దు గ్రామాలు, పట్టణాలను తుడిచిపెట్టేసింది. ఈ దారుణ ప్రకృతి విలయానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గల్లంతైనట్టు ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కైలాస మానస సరోవరం యాత్ర కోసం వెళ్లిన సుమారు వందలాది మంది భక్తుల ఆచూకీ కూడా తెలియరావడం లేదు. ప్రాణనష్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రసువా, నువాకోట్‌, దాడింగ్‌, చిత్వాన్‌ తదితర ఏడు జిల్లాల్లో బుధవారం సాయంత్రానికి 72 మృతదేహాలు బయటపడినట్టు నేపాల్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. సుమారు 403 మంది విదేశీ పర్యాటకులు గల్లంతైనట్టు నేపాల్‌ టూరిజం బోర్డు ప్రకటించింది. ఇందులో 105 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఉన్నట్లు ప్రాథమికంగా ధృవీకరించింది.

క్షణాల్లో సర్వనాశనం.. అసలేం జరిగింది?

నేపాల్‌లోని టిబెట్‌ సరిహద్దులో ఉన్న రసువా (ఖాట్మండుకు 125కిలోమీటర్ల దూరం), దాడింగ్‌ జిల్లాల పరిసరాలపై బుధవారం ఒక్కసారిగా ఆకస్మిక మెరుపు వరదలు విరుచుకుపడ్డాయి. స్థానికంగా ఎటువంటి వర్షం లేకపోయినప్పటికీ.. ఉదయం 8.30-9 గంటల సమయంలో క్షణాల వ్యవధిలో కొండత ఎత్తున దూసుకొచ్చిన బురదనీరు, బండరాళ్లు.. గ్రామాలు, పట్టణాలు, మార్కెట్లు, సరిహద్దు చెక్‌పోస్టులను తుడిచిపెట్టేశాయు. టిబెట్‌ వైపు భారీ హిమనీనదం బద్దలు కావడం ఈ విపత్తుకు దారితీసినట్టు భావిస్తున్నారు. వరద రావడానికి ముందు ఆ పారంతంలో (గొసైన్‌కుండకు ఉత్తరాన 47కిలోమీటర్ల దూరంలో టిబెటన్‌ పరిధిలో) 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు, యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. దీనివల్లే హిమనీనదం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు. దీంతో టిబెట్‌ వైపు నుంచి నేపాల్‌లోకి ప్రవహించే భోటేకోశి, త్రిశూల్‌ నదులు ఉప్పొంగి, నేపాల్‌ సరిహద్దు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనంత పెద్ద శబ్దంతో బురదనీరు, భారీ బండరాళ్లు సరిహద్దు ప్రాంతాలపైకి దూసుకువచ్చాయి. టిబెట్‌లోని సరిహద్దు పట్టణం గైరోంగ్‌ సైతం తుడిచిపెట్టుకుపోయింది. ఎగువన టిబెట్‌ నుంచి ఐదంతస్తుల ఎత్తున బురదమట్టి, బండరాళ్లతో కూడిన వరదనీరు గైరోంగ్‌ సరిహద్దుదాటి నేపాల్‌లోని రసువాపై పడింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే టిమురే, స్యాప్రుబేసి ప్రాంతాల్లో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రోడ్లు, వంతెనలు, సరిహద్దు చెక్‌పోస్టులు, వాహనాలు, కమ్యూనికేషన్‌ టవర్లు జలసమాధి అయ్యాయి. 12 జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు భారీనష్టం వాటిల్లిందని అంచనా. దీంతో 430 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి (దేశ మొత్తం సామర్థ్యంలో 12 శాతం) నిలిచిపోయింది. గైరోంగ్‌లోని చైనా సరిహద్దు ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్టును ఐదంతస్తుల ఎత్తులో వచ్చిన వరద నీరు ముంచెత్తిన భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరదనీరు ఇళ్లను పేకమేడల్లా పెకిలించేయడం అందులో కనిపించింది. నేపాల్‌లోని నువాకోట్‌, చిత్వాన్‌ జిల్లాల్లోని సమీప ప్రాంతాలు కూడా ఈ విపత్తు బారినపడ్డాయి. హిమాలయల్లోని సరస్సు విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి ఉంటాయని ఖాట్మండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటెగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవల్‌పమెంట్‌ నిపుణులు పేర్కొన్నారు.

సరిగ్గా గతేడాది ఆగ్‌స్టలోనూ ఈ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించడం గమనార్హం. కాగా, నేపాల్‌ ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టింది. వరదనీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు నేపాల్‌ సైన్యం, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో 30కు పైగా హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. సాయుధ బలగాలు (ఏపీఎఫ్‌), విపత్తు నిర్వహణ బృందాలు సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు మొదలుపెట్టాయి అయితే, మౌలిక వసతులు కొట్టుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకిగా మారింది. భోటేకోశి, త్రిశూల్‌ నదుల సమీప గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నేపాల్‌ వరద విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. భారత్‌ తక్షణమే స్పందించి మిలటరీ రవాణా విమానంలో సహాయక సామగ్రిని పంపింది. ఇందులో అత్యవసర షెల్టర్లు, దుప్పట్లు, సోలార్‌ ల్యాంప్‌లు, ఔషధాలు ఉన్నాయి.

యూపీ, బిహార్‌లో అప్రమత్తం..

నేపాల్‌లోని త్రిశూల్‌ నది నుంచి భారీగా వరదనీరు దిగువకు వస్తుండడంతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. బిహార్‌లోని వాల్మీకీనగర్‌ వద్ద ఉన్న గండక్‌ బ్యారేజీ 36 గేట్లను ఎత్తివేసి, హై అలర్ట్‌ ప్రకటించారు. యూపీలోని మహారాజ్‌గంజ్‌, కుషీనగర్‌ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy