Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంల చోరీ..

కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంల చోరీ..

రీంనగర్: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడ్డారు.

పోలీసులకు సవాల్ విసిరేలా పక్కా ప్లాన్‌తో దొంగతనాలు చేశారు. ఒక చోట సీసీ కెమెరాలను ధ్వంసం చేయగా, మరో చోట లేడీ గెటప్‌లో వచ్చి సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టి మరీ నగదు ఎత్తుకెళ్లారు.

కరీంనగర్ జిల్లా దురిషేడ్‌లో ఎస్బీఐ ఏటీఎంను ముగ్గురు దుండగులు టార్గెట్ చేశారు. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన దొంగలు ఏటీఎంలోకి చొరబడ్డారు. ముందుగా అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సాయంతో క్యాష్ మిషన్‌ను కట్ చేసి అందులోని నగదును దోచుకున్నారు. చోరీ అనంతరం దుండగులు స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదే సమయంలో తిమ్మాపూర్‌లోని మరో ఎస్బీఐ ఏటీఎంలోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. అయితే ఇక్కడ దొంగలు అనుసరించిన పద్ధతి పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంది. లేడీ గెటప్‌లో చోరీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెల్లవారుజామున ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టారు. తమ కదలికలు స్పష్టంగా రికార్డు కాకుండా చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అనంతరం ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో ఏటీఎంలను టార్గెట్ చేయడం, ముందస్తు ప్రణాళికతో సీసీటీవీ కెమెరాలను నిర్వీర్యం చేయడం సంచలనంగా మారింది.

ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఉపయోగించిన వాహనం, ఘటనకు ముందు, ఆ తర్వాత వారి కదలికలను పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ దిశగా వెళ్లారనే దానిపైనా ఆరా తీస్తున్నారు. మరోవైపు, రెండు ఘటనలకు ఒకే ముఠా కారణమా? లేక వేర్వేరు ముఠాలు చోరీలకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy