ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ (26) హత్యకేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. పుణె సమీప లోహ్‌గఢ్ కోట వద్ద లోయలోకి తోసి కేతన్‌ను హత్య చేయాలని సియాను ఆమె ప్రియుడు చేతన్ ప్రేరేపించాడని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
అయితే తాజాగా రెస్క్యూ టీమ్ సభ్యుడు సునీల్ గైక్వాడ్ కీలక విషయాలను వెల్లడించాడు.
లోహగఢ్ కోట వద్ద లోయలో లభ్యమైన కేతన్ మృతదేహంపై ఉన్న గాయాలు ఈ హత్యలోని క్రూరత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. మృతుడి తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అతని పుర్రె(తలభాగం) పూర్తిగా ఛిద్రమైందని సునీల్ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా, అతని కాళ్లు, చేతులపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, సుమారు రెండు గంటల పాటు శ్రమించి దట్టమైన అడవి, నిటారుగా ఉన్న కొండల గుండా మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చింది.
మధ్యాహ్నం 1:30 గంటలకు మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి చేర్చడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ దారుణ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. అయితే కేతన్ మృతదేహాన్ని వెలికితీసే సమయంలో అక్కడ ఉన్న వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురికాగా.. సియా మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ప్రశాంతంగా కనిపించిందని రెస్క్యూ టీమ్ తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరుగా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని సీఎంవో 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.

