Dailyhunt
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ (Sasikala) కీలక ప్రకటన చేశారు. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కొత్త రాజకీయ చరిత్రను మనం చూడబోతున్నామని, కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ద్రవిడ ఉద్యమం స్ఫూర్తితో అన్నాదురై, పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మ అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. పేదలు, బడుగు వర్గాలు, సామాన్య ప్రజానీకం కోసం పార్టీ పాటుపడుతుందని, శత్రువులు, ద్రోహులను ఏరివేస్తామని శశికళ తెలిపారు.

జెండా ఆవిష్కరణ

పార్టీ జెండాను ఈ సందర్భంగా శశికళ ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులు కలిగి, అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్తరువులతో ఈ జెండా రూపొందింది. పార్టీ పేరును త్వరలోనే ప్రకటిస్తామని శశికళ తెలిపారు.

ఆరోజు జరిగిందిదే..

2016లో జయలలిత మరణాంతరం జరిగిన సంఘటనలను శశికళ గుర్తుచేసుకుంటూ, అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా తనను ముఖ్యమంత్రి కావాలని కోరారని చెప్పారు. 'చిన్నమ్మా... మీరు తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలి అని వాళ్లంతా నాతో అన్నారు' అని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను వ్యక్తిగత పనులు ఉండటంతో అందుకు నిరాకరించానని, ఓ పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగారని తెలిపారు. ఆ తదుపరి క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగాల్సి ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy