ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఆరంభంలో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో వరుసగా నాలుగో ఓటమిని చవి చూసి ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పంజాబ్ జట్టుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోర్నీ ఆరంభంలో అద్భుతమైన కెప్టెన్సీ అంటూ ప్రశంసించిన వాళ్లే.. ఇప్పుడు వ్యూహాత్మక నిర్ణయాల వల్లే ఓటములు అంటూ విమర్శిస్తున్నారు. ప్లేయర్లలో క్రమశిక్షణ, సమన్వయం లోపించాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
'విమర్శలు, అసత్య ప్రచారాల మధ్య చాలా తేడా ఉంటుంది. గేమ్ గురించి చేసే విలువైన చర్చలను మేం స్వాగతిస్తాం. కానీ ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలను వ్యాప్తి చేస్తూ.. మా ఆటగాళ్లు, జట్టు పరువుకు భంగం కలిగిస్తే మాత్రం సహించేది లేదు. నిరాధార సమాచారం విషయంలో మీడియా అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా' అని ప్రీతి జింటా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా ఈ విషయం స్పందించింది. 'క్రీడల్లో విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు సాధారణమే. కానీ చౌకబారు ఆదరణ కోసం అసత్య కథనాలను సృష్టించడం ఆటలో భాగం కాదు. పాపులారిటీ కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి' అని పేర్కొంది. ఇదిలా ఉంటే, పంజాబ్ కింగ్స్ ఆడిన 11 మ్యాచుల్లో ఆరింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలవలేకపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్లే!

