Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం

మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం

నెల్లూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు.

మహానాడు నిర్వహణకు పలుచోట్ల స్థలాలను చూశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో డెలిగేట్స్ వస్తారని తెలిపారు. ఈ స్థలాలకు సంబంధించిన నివేదికలను జాతీయ పార్టీకి పంపించామని చెప్పుకొచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 44 ఏళ్ల క్రితం దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుంచి మహానాడు జరుగుతోందని తెలిపారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిర్ణయించారని అన్నారు.

ఉత్తరాంధ్రలో ప్రముఖ పరిశ్రమలు..

ఉత్తరాంధ్రలో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండవది అయిన గుగూల్ సంస్థకి విశాఖపట్నంలో శంకుస్థాపన జరిగిందని ప్రస్తావించారు. అందుకే శ్రీకాకుళంలో నిర్వహించాలని తలపెట్టిన మహానాడును నెల్లూరుకి మార్చినట్లు వివరించారు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా మహానాడు జరగబోతుందని చెప్పుకొచ్చారు. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ, ఇవాళ జాతీయ పార్టీల్లో నాల్గొదిగా ఎదిగిందని ఉద్ఘాటించారు. మహానాడులో మొదటి రెండు రోజులు కనీసం 25వేల మంది డెలిగేట్స్ పాల్గొంటారని వెల్లడించారు. మూడోరోజు ఎనిమిది లక్షల మందితో బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. నెల్లూరు జిల్లాలో చాలా జాతీయ రహదారులకు గతంలో నాంది పలికామని ప్రస్తావించారు. చెన్నై - కోల్‌కత్తా, చెన్నై - ఢిల్లీ జాతీయ రహదారులు ఉండేవని తెలిపారు. నాటి ప్రధాని వాజ్‌పేయితో చంద్రబాబు చర్చించి పెద్దఎత్తున జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మొదట నెల్లూరు - చెన్నై నాలుగులైన్ల జాతీయ రహదారి నిర్మించినట్లు చెప్పారు. దేశంలో ఆ తర్వాత పెద్దఎత్తున జాతీయ రహదారులు నిర్మించారని అన్నారు. కృష్ణపట్నం పోర్డు నుంచి ముంబై కాండ్లా పోర్టుకు జాతీయ రహాదారి మంజూరైందని .. ఇందుకోసం భూ సేకరణ పూర్తైందని తెలిపారు.

జగన్ అండ్ కోవి అసత్యాలు..

రూ.3653 కోట్లతో అంచనాలు రూపొందించామని.. ఇందుకు అవసరమైన నిధులు మంజూరయ్యాయని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీనివల్ల ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు. నెల్లూరుపాళెం - సోమశిల రోడ్డును స్టేట్ హైవేగా తీసుకోవాలని ప్రతిపాదన చేశామని.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తుందని అన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంజూరైందని చెప్పారు. భూసేకరణకు రూ.400కోట్లు అవసరమైతే తామే ఒప్పించామని ప్రస్తావించారు. చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఆ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. వైసీపీ నేతలు కొందరు ఆ రైల్వేలైను తామే తెచ్చినట్లుగా, రైల్వేలైను వేసినట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని ఆగ్రహించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy