Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా బిల్లు, పునర్విభజనపై ముందుకే!

మహిళా బిల్లు, పునర్విభజనపై ముందుకే!

  • కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కారు సన్నద్ధం

  • 20 నుంచి ఆగస్టు 13 దాకా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

  • జమిలి ఎన్నికలు, పీఎం, సీఎంల తొలగింపు బిల్లులనూ ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీయే

  • నీట్‌ లీకేజీ, అయోధ్య, పెట్రో ధరలపై నిలదీతకు విపక్షాలు రెడీ.. సర్‌, ఓట్ల తొలగింపుపైనా!

న్యూఢిల్లీ, జూలై 3: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి. రాజకీయంగా కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసుకోవాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు.. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య రామాలయం విరాళాల చోరీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. టీఎంసీ, శివసేన (యూబీటీ) వంటి ప్రాంతీయ పార్టీల్లో లుకలుకలు, భారీ ఫిరాయింపులు, బేరసారాలపైనా నిలదీయనుంది. వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగే అవకాశముంది. మొత్తం 19 పనిదినాలపాటు ఉభయ సభలు నడుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 20 మంది టీఎంసీ ఎంపీల వేరుకుంపటి, ఆరుగురు శివసేన-యూబీటీ ఎంపీలు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడం వంటి వివాదాలు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ముందు విచారణలో ఉన్నాయి. వర్షాకాల సమావేశాలు మొదలయ్యేలోపే ఆయన తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు. రాజ్యసభలో ఎన్డీయే మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఉంది. లోక్‌సభలోనూ బలం పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల సంఖ్యాబలాన్ని 50 శాతం పెంచే ప్రతిపాదనను రాజ్యాంగ బిల్లులో పొందుపరచనుంది. అలాగే ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు అరెస్టయి 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవుల నుంచి వైదొలగాలన్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చే వీలుంది. దీనిపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా కొన్ని రక్షణ చర్యలు ప్రతిపాదించింది. అలాగే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక(జమిలి ఎన్నికలు)' బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెడుతుందని అంటున్నారు. ఇక విదేశీ విరాళాల నియంత్రణ చట్టాని(ఎ్‌ఫసీఆర్‌ఏ)కి సంబంధించిన వివాదాస్పద బిల్లులు కూడా సభల ముందుకు రానున్నాయి. వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌, యాంటీ డోపింగ్‌ సంస్కరణలు, సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు, కార్పొరేట్‌ చట్ట సంస్కరణలు, సెక్యూరిటీస్‌ మార్కెట్‌ కోడ్‌ బిల్లులను సైతం కేంద్రం సభల్లో ప్రవేశపెట్టనుంది.

విపక్షాల చేతికి శస్త్రాస్త్రాలు..

పార్లమెంటులో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడానికి ప్రతిపక్షాలు కూడా శస్త్రాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రుతుపవన వర్షాల లోటు, కరువు, వరదలు, నీట్‌ పేపర్‌ లీక్‌, సీబీఎ్‌సఈ మార్కింగ్‌ సిస్టమ్‌, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అందిన విరాళాల దొంగతనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాటిపై నిలదీయనున్నాయి. ఇక ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(సర్‌) ప్రక్రియ పేరిట ఎన్నికల కమిషన్‌ రాష్ట్రాల్లో లక్షలకొద్దీ ఓట్లు తొలగించడంపై విమర్శలను తీవ్రతరం చేసిన ఇండీ కూట మి.. తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు లేఖ కూడా రాసింది. అయితే బెంగాల్‌, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలు అందుకున్న బీజేపీ.. ఈ వ్యవహారంలో ఉభయసభల్లో ఎదురుదాడికి దిగాలని భావిస్తోంది. కేరళలో కాంగ్రెస్‌, తమిళనాడులో టీవీకే గెలుపును ప్రస్తావించి.. వాటి విమర్శలను ఖండించనుంది.

ఈ వార్తలనూ చదవండి:

వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy