Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

ఇంటర్నెట్ డెస్క్: సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్స్ ట్రీటీ-IWT)పై పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది భారత్. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ తన మద్దతును తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది.

ఆ దేశం అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న ప్రచారం, బెదిరింపు వ్యాఖ్యలు తమ నిర్ణయాన్ని ఏమాత్రం ప్రభావితం చేయవని తేల్చిచెప్పింది.

ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. 'సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలి. అప్పటివరకు భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం సింధు జలాల ఒప్పంద అమలును నిలిపివేస్తాం' అని అన్నారు. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో.. భారత్‌ ఈ ఒప్పంద అమలును నిలిపివేసిందని ఆయన గుర్తుచేశారు.

కాగా.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం సింధు నది, దాని ఉపనదుల జలాల పంపిణీ, వినియోగాన్ని నియంత్రిస్తోంది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం భారత్‌, పాక్ ఈ అగ్రీమెంట్‌పై సంతకాలు చేశాయి. అయితే మారుతున్న పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం నేపథ్యంలో ఒప్పందం కొనసాగింపుపై భారత్‌ తన వైఖరిని కఠినతరం చేసింది. ఇటీవల పాక్ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ ఈ డీల్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఇక.. ఆ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ఒప్పందం పునరుద్ధరణ జరక్కపోతే అణు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన నేపథ్యంలో.. ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి బాధ్యతలూ వర్తించవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సార్వభౌమ దేశంగా తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌కూ అధికారం లేదని కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో అఫ్గానిస్థాన్‌పై పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడులనూ తీవ్రంగా ఖండించింది భారత్. ఆ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. అఫ్గాన్‌ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భారత్‌ తన మద్దతును కొనసాగిస్తుందని పేర్కొంది.

ఇవీ చదవండి:

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy