Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌!

మహిళా రిజర్వేషన్ బిల్లు.. రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌!

ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్‌ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు..

'ఎక్స్‌' సోషల్ మీడియా వేదికగా పరస్పరం స్పందించారు. మహిళా శక్తిపై రాహుల్‌ వ్యాఖ్యలను స్వాగతించిన రిజిజు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ బేషరతుగా మద్దతివ్వాలని కోరారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన రాహుల్.. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.

ఈ వీడియోపై రిజిజు స్పందిస్తూ.. 'కాంగ్రెస్‌ పార్టీలో ఇది సానుకూల సందేశంగా కనిపిస్తోంది. రాహుల్‌ వైఖరిలో మహిళల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది' అని 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఎలాంటి షరతులు లేకుండా మద్దతివ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

రిజిజు వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ వెంటనే స్పందించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును 2023లోనే పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. 'పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీకంటే ఈ విషయం బాగా ఎవరికి తెలుస్తుంది? మహిళా రిజర్వేషన్‌ చట్టం-2023 కాంగ్రెస్‌ పూర్తి మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదమైంది. అయినా మూడేళ్లు గడిచినా ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు దాన్ని డీలిమిటేషన్‌తో అనవసరంగా ఎందుకు ముడిపెడుతున్నారు?' అని ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే 2023 చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ విడుదల చేసిన ఈ వీడియోలో మహిళల సామర్థ్యంపై విస్తృతంగా ప్రసంగించారు. దేశంలోని మహిళల శక్తి ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రాలేదన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని, తమకు నచ్చిన రంగాల్లో ముందుకు సాగేందుకు అవకాశం ఉండాలని పేర్కొన్నారు. మహిళలు.. వ్యాపారం, రాజకీయాల్లో రాణించడమే కాకుండా.. ఇళ్లలోనూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలగాలని, సమాజంలో ఎలాంటి భయం లేకుండా తిరగగలగాలని చెప్పారు. పితృస్వామ్య భావజాలం, మహిళలపై ఉండే కఠిన నియంత్రణ నుంచి కొంత విముక్తి అవసరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా శక్తి, మహిళా రిజర్వేషన్‌ అంశాలపై రాహుల్‌ చేసిన వరుస వ్యాఖ్యల నేపథ్యంలో.. కేంద్రంతో కాంగ్రెస్‌ మధ్య రాజకీయ వాగ్వాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఇవీ చదవండి:

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy