Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

మహిళల భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ..

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది.

తదుపరి మ్యాచుల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో తలపడాల్సి ఉంది. ఈ తరుణంలో హర్మన్ ప్రీత్ కౌర్ సేనాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో ఈ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా ఆమె స్థానంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రేమా రావత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం(మే 17న) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు గాయమైంది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి చీలమడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కాలు నేలపై పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలి తీసుకెళ్లి... ఆ తర్వాత స్కానింగ్‌ కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా రిపోర్టులో శ్రేయాంక కాలి చీలమడమకు గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశముందని వెల్లడించారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్‌ చికిత్స తీసుకోనుంది. గతంలో ఆమె వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది.

ఇప్పుడు వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. శ్రేయాంక స్థానంలో ఎంపికైన ప్రేమా రావత్‌కు ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్‌లో తన లెగ్-స్పిన్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశవాళీ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె భారత్-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy