Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

ఇంటర్నెట్ డెస్క్: హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తీవ్ర శిక్షార్హమైన నేరారోపణలు ఉన్న ఇలాంటి కేసులను వ్యక్తిగత చట్టాల పేరుతో రద్దుచేయాలని కోరడం సమంజసం కాదని జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హలాలా పేరుతో ఓ మహిళపై లైంగిక దోపిడీ, సామూహిక అత్యాచారం సంబంధిత ఆరోపణల కేసులో 9 మంది నిందితులపై నమోదైన కేసును కొట్టివేయాలనే పిటిషన్ను తిరస్కరించింది.

ఇదీ కేసు..

ఉత్తర్‌ప్రదేశ్‌ అమ్రోహాకు చెందిన ఓ బాధితురాలు.. తనకు 15 ఏళ్ల వయసు(2015)లో బలవంతంగా వివాహం జరిగినట్టు ఆరోపించారు. ఆ తర్వాత 2016లో భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని, కానీ మరలా అతడినే పెళ్లాడాలంటే హలాలా తప్పనిసరని మతపెద్దలు బలవంతం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హలాలా పేరిట ఓ వ్యక్తి తనను శారీరకంగా వేధించాడని, అనంతరం 2017లో మరలా మొదటి భర్తతోనే వివాహం జరిగినట్లు ఆరోపించారు. ఆ తర్వాత 2021లో మరోసారి అతడు ట్రిపుల్ తలాక్ చెప్పి, వేరే మహిళను పెళ్లాడాడన్నారు. ఆ పిదప మళ్లీ కలిసి జీవిద్దామని చెప్పిన భర్త కుటుంబ సభ్యులు.. రెండు మార్లు తలాక్ జరిగినందున మరోసారి హలాలా చేయాల్సిందేనని బెదిరించారని ఆమె వాపోయారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరిలో భర్త సోదరులు హలాలా పేరిట తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆమె.. ఆ తర్వాత నామమాత్రంగా ఓ నికాహ్ కూడా చేశారని చెప్పుకొచ్చారు.

కాగా.. ఈ వ్యవహారం ముస్లిం వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాలకు సంబంధించినదని.. ఫలితంగా ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని న్యాయస్థానాన్ని కోరారు నిందితులు. అయితే.. ఈ వాదనల్ని ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. క్రిమినల్ చట్టం అమలులో ఉండగా వ్యక్తిగత చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వలేమని, చట్టంలో ప్రత్యేక మినహాయింపులేమైనా ఉన్నప్పుడే ఇలాంటి వాదనలకు అవకాశముంటుందని స్పష్టం చేసింది. బాలికలపై లైంగిక సంబంధాలకు వ్యక్తిగత చట్టాలను రక్షణగా చూపలేమని, అలాంటి కేసులకు పోక్సో చట్టం వర్తిస్తుందని పేర్కొంది. దీంతోపాటు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులన్నింటినీ కోర్టు రద్దు చేయడంతో.. ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

ఇవీ చదవండి:

ప్రాంక్‌ వీడియోల కోసం ఈ-రిక్షాల 'రిమోట్ షట్‌డౌన్' కలకలం.. 2 యాప్స్ డిలీట్!

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అలాంటి వాళ్లు హిందువులే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy