Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం

మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం

ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదనే కారణంతో ఆమె నామినేషన్‌ను రద్దుచేసిన ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్.. ఒకసారి నామినేషన్‌ను తిరస్కరించాక, ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ ఎన్నికల సంఘాన్నే ఆశ్రయించాల్సిందేనని పేర్కొంది. ప్రస్తుత దశలో తాము నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.

పిటిషనర్ మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్‌వీ వాదనలు వినిపిస్తూ.. కనీసం రెండేళ్ల శిక్ష విధించే అవకాశమున్న కేసులనే అభ్యర్థులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేసులో సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ధర్మాసనానికి వివరించారు. అయినప్పటికీ రిటర్నింగ్ అధికారి తప్పుగా ధ్రువీకరిస్తూ.. నామినేషన్‌ను తిరస్కరించారని వాదించారు. దీనిపై స్పందిస్తూ, నామినేషన్‌ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. గతంలో అలాంటి తీర్పులేమైనా ఉంటే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని సూచించింది.

అయితే.. అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం మీనాక్షి సమర్పించిన ఫారం-26 అఫిడవిట్‌లో తెలంగాణ కేసు వివరాలు పొందుపరచలేదని రిటర్నింగ్ అధికారి అర్వింద్ శర్మ పేర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురైన అంశాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ తీవ్రంగా ఖండించారు.

ఇవీ చదవండి:

నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy