Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా(49) కన్నుమూశారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ పోటీల నుంచి భారత బృందంతో కలిసి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు రాణా. అనంతరం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు స్టెంట్ అమర్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు జాతీయ రైఫిల్ సంఘం(NRAI) వర్గాలు వెల్లడించాయి.

జస్పాల్ రాణా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత క్రీడా ప్రపంచానికి ఇది తీరని లోటన్నారు. షూటింగ్ క్రీడాకారుడిగా దేశానికి ఎన్నో విజయాలు అందించిన రాణా.. కోచ్‌గా యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలోనూ విశేష సేవలందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా రంగానికి ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ.

ఆధునిక షూటింగ్‌పై రాణా ప్రభావం..

1976లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన రాణా.. చిన్న వయసులోనే షూటింగ్‌లో ప్రతిభ కనబరిచారు. 1994లో హిరోషిమా(జపాన్)లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కూడా కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పలు పతకాలు కైవసం చేసుకున్న ఆయన.. భారత షూటింగ్‌కు విశేష కీర్తి తెచ్చిపెట్టారు. ముఖ్యంగా 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ క్రీడల్లో ఏకంగా 6 పతకాలు సాధించడం ఆయన కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

క్రీడాకారుడిగా విజయవంతమైన ప్రయాణం సాగించిన జస్పాల్.. ఆ తర్వాత శిక్షకుడిగా మారి భారత పిస్టల్ షూటింగ్ అభివృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మనుబాకర్ సహా పలువురు ప్రముఖ షూటర్లకు ఆయన మార్గదర్శకుడిగా ఉన్నారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మనుబాకర్ 2 పతకాలు సాధించిన సమయంలో ఆమె కోచింగ్ బృందంలో రాణా సభ్యుడు కావడం విశేషం.

షూటింగ్ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1994లో 'అర్జున', 1997లో 'పద్మశ్రీ' పురస్కారాలతో సత్కరించింది. తన ప్రతిభ, క్రమశిక్షణ, శిక్షణా నైపుణ్యాలతో భారత షూటింగ్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన జస్పాల్ మృతి క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

ఇవీ చదవండి:

అమెరికాతో డీల్ చేసుకోలేదు.. తేల్చి చెప్పిన ఇరాన్..

అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy