Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదుగ.. ఆరోగ్యానికి ఆమోదమే

మోదుగ.. ఆరోగ్యానికి ఆమోదమే

న ఆహార సంస్కృతిలో ప్రతీ ఆకుకీ, ప్రతీ కాయకీ, ప్రతీ విత్తనానికీ ఒక ఆరోగ్య తత్వం దాగి ఉంది. మోదుగ ఆకులు ఔషధానికే కాదు ఆహారానికి కూడా పనికొస్తాయి.

విష రసాయన పూరిత ఆహార ద్రవ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడు కోవటానికి ఇలాంటి ప్రత్యామ్నాయ ద్రవ్యాల వెదకులాట కూడా అవసరమే!

అగ్నిపూలు: మోదుగ చెట్టు అడవిలా పెరిగే మహావృక్షం. దీని పూలు చిలుక ముక్కు ఆకారంలో ఉంటాయి కాబట్టి 'కింశుక' అన్నారు. ఎర్రటి జ్వాలల్లా విరబూస్తాయి కాబట్టి అగ్నిపూలు (ఫ్లేమ్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌) అంటారు. బాగానే ఉంది గానీ, చాలా పొగరుగా 'బాస్టర్డ్‌ టేక్‌' అంటూ ఈ భారతీయ పూజనీయ వృక్షాన్ని కించపరచటమే అభ్యంతరకరం. మోదుగ గింజల్ని తెలుగులో 'మోదుగమాడ' లంటారు. ఈ గింజలు పూర్వకాలపు మాడలనే నాణెం ఆకారంలో ఉండటమే కారణం.

విస్తరి: మోదుగ ఆకులతో విస్తళ్లు కుట్టి అందులో భోజనం చేస్తే వాతవ్యాధులు, కఫ వ్యాధుల్లో మేలు చేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. అడ్డాకు విస్తళ్ళకన్నా మోదుగాకు విస్తళ్ళు ఆరోగ్యదాయకం. మోదుగలో రసాయనాలు ఉత్తమమైన క్షారగుణాలు కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని 'క్షారశ్రేష్ఠ' అంటారు.

కూర: లేత మోదుగ ఆకులు చిరుచేదుగా ఉంటాయి. ఎర్రతోటకూర లేదా పెరుగుతోటకూరతో ఈ ఆకుల్ని కలిపి తరిగి ఉడికించి, నీటిని వార్చేస్తే చేదు తగ్గుతుందని పాకదర్పణం గ్రంథంలో నలుడు ఒక ఉపా యం చెప్పాడు. దీనికి తగినంత చుక్కకూర, చింత చిగురు లేదా చింతపండు లాంటి పులుపు ద్రవ్యాల్ని కలిపి సుగంధద్రవ్యాలు చేర్చి ఇగురుకూర వండుకోవాలన్నాడు. కఫ వ్యాధులతోనూ, వాతవ్యాధులతోనూ, మానని వ్రణాలతోనూ ఇన్‌ఫెక్షన్లతోనూ సతమతమయ్యే వారికి తరచూ మోదుగ లేతాకుల కూర వండిపెడుతూ ఉంటే ఆయా వ్యాధులకు వాడే ఔషధాలు శక్తివంతంగా పనిచేస్తాయన్నాడు.

ఔషధంగా: జీర్ణకోశవ్యాధులు, కడుపులో పెరిగే ఎలికపాముల మీద పనిచేస్తుందనీ, అతిసార వ్యాధిని, అమీబియాసిస్‌ వ్యాధిని తగ్గిస్తుందనీ, షుగరు వ్యాధి ఉన్నవారికి మేలు చేస్తుందనీ నలుడు వివరించాడు. స్త్రీపురుష లైంగిక శక్తి బలపడుతుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. లివర్‌ వ్యాధుల్లో పనిచేస్తుంది. పొట్టలోపల అవయవాలలో ఏర్పడే వాపుని తగ్గిస్తుంది. నడుము చుట్టూ ఉన్న అవయవాలకు రక్తప్రసారం పెరిగేలా చేస్తుంది. చర్మవ్యాధుల మీద కూడా వీటికి ఔషధ ప్రయోజనం ఉంది.

 టీ : మోదుగ ఆకుల్ని ఎండించి దంచిన పొడితో టీ కాచుకుని రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కడుపులో పెరిగే ఎలికపాములు కొట్టుకుపోతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునే గుణం కూడా ఉంది. ఎముక పుష్టినిస్తుంది. మెనోపాజ్‌ ఎదుర్కొంటున్న స్త్రీలకు మంచిది. సొరియాసిస్‌ లాంటి చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది. షుగరు వ్యాధి, మూత్ర పిండాల వ్యాధుల్లో దీనికి ఎక్కువ ప్రయోజనాలున్నాయి. కాకరకాయల దోషాలకు మోదుగ విరుగుడు. అందుకని కాకరతో వంటకాలు చేసేప్పుడు లేత మోదుగ ఆకు ఒకటి రెండు కలిపి వండితే కాకర పడకపోవటం ఉండదు.

తంత్ర విద్యలో ఒక యోగం: మోదుగ గింజల్ని మెత్తగా దంచి ఉసిరికాయల రసం పోసి 7 రోజులపాటు, ఆ తరువాత ఆవుపాలు పోసి 7 రోజుల పాటు నానబెట్టి, ఎండించిన పొడిని పావు నుండి అర చెంచా మోతాదులో తేనెతో రోజూ ఉదయాన్నే విధిప్రకారం తీసుకుని పాలు తాగుతుంటే దూరదృష్టి కలుగుతుందని తంత్ర శాస్త్ర గ్రంథాల్లో ఉంది.

  • డా. జి వి పూర్ణచందు, 94401 72642

/span>

పొదుపు సూత్రం.. తారక మంత్రం

నాలుగైదు రోజుల్లో కేరళకు 'నైరుతి'

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy