Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

  • రూ. 2.93 కోట్లు లూటీ..

  • పోలీసులను ఆశ్రయించిన రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.

సైబరాబాద్‌ సైబర్‌ కైరమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివి. నిజాంపేట్‌కు చెందిన రామకృష్ణ బాల (52), గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసి ఆరోగ్య సమస్యల కారణంగా ఉద్యోగ విరమణ చేశారు. వ్యవసాయ భూమి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో 2025 జూన్‌లో ఫేస్‌బుక్‌ ద్వారా జ్యోత్స్నారెడ్డి గంగుల పేరుతో ఓ మహిళ రామకృష్ణకు పరిచయమైంది.

ఆమె బెంగళూరులో బ్రైడల్‌ డ్రెస్సుల డిజైనర్‌గా పరిచయం చేసుకుని, క్రిప్టో ట్రేడింగ్‌, మైనింగ్‌ పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె సూచనల మేరకు రామకృష్ణ 'గోల్డ్‌ బాక్స్‌ చైన్‌ ఎక్స్‌' అనే ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట రూ.50 వేల పెట్టుబడికి కొంత మొత్తాన్ని రిటర్న్‌గా చూపించడంతో అతనికి నమ్మకం పెరిగింది. అనంతరం భారీ లాభాల పేరుతో వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు విడతల వారీగా డబ్బులను సైబర్‌ నేరగాళ్లు బదిలీ చేయించారు.

 ఈ క్రమంలో మోనిషా ఎంటర్‌ ప్రైజెస్‌, సేవ కరో ఫౌండేషన్‌, ఓం నమఃశివాయా ఫిషర్స్‌, సిటీ నెట్‌వర్క్స్‌, అపోడా హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నెక్స్‌టెడ్‌ గ్లోబల్‌ స్టడీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గణేశ్‌ ట్రేడర్స్‌, రజక్‌ ట్రేడర్స్‌, హరిఓం స్టీల్స్‌ తదితర పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయలను ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అదే సమయంలో గోల్‌ బ్లాక్‌ చెయిన్‌ ఎక్స్‌ యాప్‌లో పెట్టుబడులు పెరిగినట్లు నకిలీ లాభాల గణాంకాలు చూపిస్తూ మరింత డబ్బు పెట్టేలా సైబర్‌ నేరగాళ్లు ప్రేరేపించారు.

మొత్తంగా బాధితుడు రూ.2,93,59,944 వివిధ ఖాతాలకు బదిలీ చేయగా, కేవలం రూ.16,820 మాత్రమే తిరిగి వచ్చాయి. అనంతరం యాప్‌ పనిచేయకపోవడం, సంబంధిత వ్యక్తులు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సైబర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy