Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: పాక్ సౌందర్య ఉత్పత్తులపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌లో తయారైనట్లు పేర్కొంటున్న 2 రకాల ఫెయిర్‌నెస్‌ క్రీములను అనుమతి లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించింది.

ఈ మేరకు 'గోరీ బ్యూటీ క్రీమ్‌', 'చాందినీ వైటెనింగ్‌ క్రీమ్‌'లను కొనుగోలు చేయవద్దని.. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే వినియోగించవద్దని సూచించింది.

ఈ రెండు కాస్మొటిక్‌ ఉత్పత్తుల్లో నిర్దేశిత పరిమితులకు మించి హెవీ మెటల్స్ ఉన్నట్లు సీడీఎస్‌సీఓ తన హెచ్చరికలో పేర్కొంది. అధిక మోతాదులో ఈ మెటల్స్ ఉండటం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. కాగా.. వినియోగదారులు వాడే సౌందర్య ఉత్పత్తులు సురక్షితంగా ఉండేలా వాటి తయారీ, దిగుమతులను డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ చట్టం-1940, కాస్మొటిక్స్‌ రూల్స్‌-2020 కింద నియంత్రిస్తారు. వీటి ఉత్పత్తులకు సంబంధించిన ప్రమాణాలను భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) నిర్దేశిస్తుంది. ఈ కాస్మొటిక్స్‌ను తయారు చేసి విక్రయించేందుకు సంబంధిత లైసెన్సింగ్‌ సంస్థ నుంచి అనుమతి పొందాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రాడక్ట్స్‌కు నిర్దేశిత నిబంధనల ప్రకారం కేంద్ర లైసెన్సింగ్‌ సంస్థ వద్ద రిజిష్టర్ అయి ఉండాలి.

లేబుల్‌ చూశాకే..

అనధికారిక ఉత్పత్తుల బారినపడకుండా ఉండేందుకు వినియోగదారులు క్రీమ్‌లు, ఇతర కాస్మొటిక్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్యాకింగ్ వివరాలను పరిశీలించాలని సీడీఎస్‌సీఓ సూచించింది. ముఖ్యంగా లైసెన్స్‌ నంబర్‌, బ్యాచ్‌ నంబర్‌ సహా ఎమ్ఎఫ్‌జీ, ఎక్స్పైరీ డేట్స్ వంటి వాటిని క్షుణ్నంగా పరిశీలించాలంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాడక్ట్స్ విషయంలో సంబంధిత రిజిస్ట్రేషన్‌ నంబర్‌నూ చూడాల్సి ఉంటుందని తెలిపింది. పర్మిషన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ స్పష్టంగా లేని ఉత్పత్తులను కొనొద్దని సూచించింది. ముఖ్యంగా తెల్లగా మారుస్తామంటూ హామీ ఇచ్చే మోసపూరిత క్రీమ్‌ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy