Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్కులో యువకుల వీరంగం.. ప్రేమ జంటపై దాడి..

పార్కులో యువకుల వీరంగం.. ప్రేమ జంటపై దాడి..

త్తర్ ప్రదేశ్: అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు యువకులు పబ్లిక్ పార్కులో ప్రేమ జంటపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ దాడిని హిందూ సంఘాలు సహా నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అయోధ్యలోని తులసి ఉద్యాన్‌లో సరదాగా గడిపేందుకు ప్రేమ జంట వెళ్లింది. కాసేపటికే సాధువుల వేషధారణలో నలుగురు వారి వద్దకు వెళ్లారు. యువతీయువకుడిని దూషించడం మొదలుపెట్టి, అనంతరం భౌతిక దాడికి పాల్పడ్డారు. కాళ్లతో తంతూ, పిడికిళ్లతో గుద్దుతూ దారుణంగా కొట్టారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రేమికులు పార్కు నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే వారిని వెంబడించి మరీ పార్కు బయట పట్టుకున్నారు యువకులు. పార్కు వెలుపల ప్రధాన రహదారిపైనా యువకుడిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ సమయంలో గుర్తింపును దాచుకునేందుకు యువతి తన ముఖాన్ని చున్నీతో కప్పుకుంది. అలాగే ప్రియుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది.

నిందితుల దాడి తీవ్రం కావడంతో యువకుడిని చుట్టుకుని, వారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించింది యువతి. ఎట్టకేలకు వారి చెర నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఈ దాడిని అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారే తప్ప, ప్రేమ జంటను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అయోధ్య కొత్వాలి పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చక్రపాణి తివారీ తెలిపారు. నిందితులిద్దరూ గోండా వాసులైన ధర్మేంద్ర దాస్, గుంకేశ్ తివారీగా గుర్తించినట్లు పేర్కొన్నారు. విద్యాభ్యాసం నిమిత్తం వారిద్దరూ అయోధ్యలో ఉంటున్నారని తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమికులు పార్కులో అసభ్యంగా ప్రవర్తించడంతోనే దాడి చేసినట్లు పోలీసులకు నిందితులు తెలిపారు.

మరోవైపు ఈ దాడిని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. యువతీయువకులు తప్పుగా ప్రవర్తించి ఉంటే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలే తప్ప, దాడి చేయడం సరికాదని హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy