బైక్ ట్యాక్సీవాలాల్లో 60 శాతం పార్ట్‌టైమర్లే
అంతా ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులే
అదనపు సంపాదన కోసం గుట్టుగా
బైక్ టాక్సీవాలా అవతారం
మధ్యతరగతి జీవికి కొంత ఆర్థిక ఊరట
బైక్ ట్యాక్సీవాలాలకు 'ఎల్లో నంబరు ప్లేటు'
తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం
రెక్కల కష్టంతో మా తిప్పలు మేం పడ్తున్నం
నంబరు ప్లేటు రంగు మారితే
బంధు, మిత్రుల్లో తలెత్తుకోగలమా?
ఆందోళనలో పార్ట్‌టైమర్లు
ఆటో డ్రైవర్లు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గొద్దు
ఇతర రాష్ట్రాల్లో సాధారణ నంబరు ప్లేట్‌తో
అనుమతిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుల వినతి
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దుర్గా చరణ్ ఓ ప్రైవేటు ఉద్యోగి. సాయంత్రం ఐదున్నరకు ఆఫీసుకు వెళ్లి రాత్రి ఒంటిగంటన్నరకు ఇంటికి చేరుకుంటాడు. ఇంటి అద్దె పెరగడం.. పిల్లల పెద్దవారవుతుండడం.. వారి ఉన్నత చదువుల ఖర్చులకు తోడు ఆయనకు హృద్రోగ సమస్యలకు వైద్యం, మందుల ఖర్చులు తడిసిమోపెడవుతుండడంతో వచ్చే జీతం డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పగలు సమయం దొరకడంతో కొన్ని నెలలుగా గుట్టుగా రోజూ బైక్ టాక్సీ నడుపుతున్నాడు. అలా పార్ట్‌టైమ్ బైక్ ట్యాక్సీవాలాగా రోజుకు రూ.500-రూ.600 దాకా ఆయనకు లభిస్తోంది. వేన్నీళ్లకు చన్నీళ్లలా ఆ డబ్బుతో ఇంటి ఖర్చులు వెలుతుండటంతో అప్పుల బాధ నుంచి దుర్గా చరణ్ కాస్త స్థిమితపడ్డాడు! అయితే 'బైక్ ట్యాక్సీ వాలాల' విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న ఓ నిర్ణయం దుర్గా చరణ్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
బైక్ ట్యాక్సీవాలాలు అందరిలా సాధారణ నంబరు ప్లేట్లు ఉపయోగించడానికి వీల్లేకుండా, పసుపు రంగు నంబరు ప్లేటు తప్పనిసరి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియకుండా పార్ట్‌టైమ్ ట్యాక్సీవాలాగా ఉపాధి పొందుతున్నాని.. ఇప్పుడు బైక్ నంబరు ప్లేట్ పసుపు రంగులోకి మార్చుకుంటే బంధువులు, మిత్రులు తనను ఏదో రకంగా చూస్తారని దుర్గా చరణ్ ఆవేదన చెందుతున్నాడు. బైక్ ట్యాక్సీవాలాలకు పచ్చ నంబరు ప్లేట్ విధానాన్ని తీసుకొస్తే పార్ట్ టైమర్‌గా నెలకు రూ.20వేల నుంచి రూ.22 వేలు సంపాదించుకుంటున్న తన పొట్ట కొట్టినట్లేనని ఆందోళనకు గురవుతున్నాడు. దుర్గా చరణ్ మాదిరే అయినవారికి, బంధుమిత్రులకు, కనీసం కాలనీవాసులకూ తెలియకుండా పార్ట్‌టైమ్ బైక్ టాక్సీవాలాలుగా ఉపాధి పొందుతున్న ఎంతోమంది ప్రైవేటు ఉద్యోగులు ఇప్పుడిలానే ఆందోళనకు గురవుతున్నారు.
ఇన్నాళ్లు సాధారణ నంబరు ప్లేట్ ఉండటంతో ఎవ్వరికీ తెలియకుండా బైక్ ట్యాక్సీవాలాలుగా ఉపాధి పొందుతున్నామని వారు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వచ్చే జీతం సరిపోక జేబు ఖాళీ అయినప్పుడు అయినవారే కదా అని ఎవర్నయినా అప్పు అడిగితే మొహం చాటేస్తారని.. అదే బైక్ ట్యాక్సీవాలా అవతారమెత్తాడని తెలిస్తే మాత్రం ''చిల్లర డబ్బుల కోసం రోడ్డెక్కాడు'' అంటూ వారే హేళన చేస్తారని.. కొన్నిసార్లు ఇది తమ అన్నదమ్ములు, భార్య తరఫు బంధువుల్లో చర్చనీయాంశమై చివరికి బంధువర్గంలోనే తమను దూరం పెట్టే పరిస్థితీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగి దుర్గా చరణ్ మాదిరిగానే దిలీప్ కశ్యప్ అనే విద్యార్థిదీ ఇదే పరిస్థితి. సొంతూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడతను.
ఇంట్లోవాళ్లు కొనిచ్చిన సెకండ్ హ్యాండ్ బైక్‌తో బైక్ ట్యాక్సీవాలాగా మారాడు. కాలేజీ ముగిశాక 3-4 గంటలు ఆ బైక్ మీద ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ వచ్చే డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటున్నాడు. ప్రభుత్వం పసుపు పచ్చ నంబరు ప్లేట్ విధానాన్ని అమల్లోకి తెస్తే.. తాను బైక్ ట్యాక్సీ నడపలేనని దిలీప్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రముఖ ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తుకారాందీ ఇదే ఆవేదన. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వచ్చే రూ.30వేల జీతం ఏమూలకు చాలకపోవడంతో సాయంత్రం కాలేజీ వదలగానే రాత్రి పదింటిదాకా బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకొచ్చాక.. బైక్‌కు పసుపు పచ్చ బోర్డు తగిలించుకుంటే.. ''లెక్చరర్ బైక్ ట్యాక్సీ నడపడమా?'' అని బంధుమిత్రులు అదో రకంగా చూస్తారని తుకారాం మధన పడుతున్నాడు. బైక్ ట్యాక్సీవాలాల్లో దుర్గాచరణ్, దిలీప్ కశ్యప్, తుకారాం మాదిరిగా పార్ట్ టైమర్లు వందకు 60 మంది ఉన్నారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలకు గిగ్ రైడర్లుగా పనిచేస్తూ బైక్ ట్యాక్సీ రంగాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా బైక్ ట్యాక్సీవాలాలు ఉన్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న బైక్ ట్యాక్సీ సేవలు ఇటీవల నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ వంటి మరో 11 ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాయి. అంటే జిల్లాల్లోనూ బైక్ ట్యాక్సీవాలాల సంఖ్య పెరుగుతోంది.
చూసీచూడనట్లు వ్యవహరించండి
కేంద్రం జారీ చేసిన మోటారు వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025లో నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలను సైతం అగ్రిగేటర్ ద్వారా ప్రయాణికుల రవాణాకు ఉపయోగించే అవకాశం కల్పించారు. ఆ అనుమతి రాష్ట్ర నియంత్రణ, షరతులకు లోబడి ఉంటుంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక సందర్భంలో బైక్ ట్యాక్సీల విషయంలో రాష్ట్రాలు కొంత చూసీ చూడనట్లు ఉండాలని సూచించారు. వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న బైక్ ట్యాక్సీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు.
బైక్ ట్యాక్సీవాలాల నిరసన
ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా బైక్ ట్యాక్సీవాలాలుగా కొనసాగుతున్నామని, ప్రభు త్వ నిబంధన కారణంగా తాము ఏ పని చేస్తున్నామనే విషయం బహిర్గతమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత వాహనానికి ట్యాక్సీ నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయం ఎంత వరకు సరైందని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగం, ఆర్థిక అవసరాలు, కుటుంబ పోషణ ఇలా అనేక కారణాలతో కనీస పెట్టుబడి లేకుండా రోజువారిగా ఉపయోగించుకునే వాహనంతో ఆర్థిక లాభం పొందేవారికి ప్రభుత్వ నిర్ణయం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందని వాపోతున్నారు. కేవలం ఆటో డ్రైవర్ల ఒత్తిడికి తలొగ్గి లక్షలాది మంది బైక్ రైడర్లకు ఇబ్బందికలిగించే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదంటున్నారు. అనేక ఇతర రాష్ట్రాల్లో సొంత వాహనాలను బైక్ ట్యాక్సీలుగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నారు.
పచ్చ ప్లేటు ఖరీదైన వ్యవహారమే!
ఫుల్ టైం, పార్ట్ టైం బైక్ ట్యాక్సీలు నడుపుతున్నవారందరూ వ్యక్తిగత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీరంతా తమ బైక్‌కు పచ్చ నంబరు ప్లేటు తగిలించుకోవాల్సి వస్తే అదో ఖరీదైన వ్యవహారంగా మారనుంది. ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఫ్లాట్‌ఫామ్‌లు ప్రతి రైడ్‌పై 20 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు వెళ్లే దూరానికి కంపెనీలు ఎలాంటి చార్జీలు చెల్లించవు. ఫుల్ టైం రైడర్లు రోజుకు 8 నుంచి 12 గంవటలు కష్టపడి బైక్ నడిపిస్తే రూ. 1500 వరకు సంపాదిస్తున్నారు. అందులో పెట్రోల్, కంపెనీ కమిషన్, బైక్ మెయింటెనెన్స్ ఖర్చులు పోనూ రూ.700-రూ.750 మిగులుతుంది.
ఇలా అరకొరే మిగులుతుంటే పసుపు పచ్చ నంబరు ప్లేట్ విధానం అమల్లోకి వస్తే గనక తమ బైక్ ట్రాన్స్‌పోర్టు కేటగిరీలోకి మారుతుందని, ఫలితంగా తమపై రిజిస్ట్రేషన్ మార్పు చార్జీలు, అదనపు పన్నులు, పర్మిట్ ఫీజులు, ఫిట్‌నెస్ తదితరాల రూపంలో భారం పడే అవకాశాలున్నాయని బైక్ ట్యాక్సీవాలాలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజు కొద్దిగంటలు మాత్రమే రైడ్ చేసే పార్ట్‌టైం రైడర్లపై ఈ భారం ఎక్కువ పడే అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. కాగా ఆగస్టు చివరి నాటికి 1,37,73,930 ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రర్ అయ్యాయి.
వీటిలో 18,314 ద్విచక్ర వాహనాలు మాత్రమే 'మోటారు సైకిల్-ట్రాన్స్‌పోర్టు' కేటగిరీలో ఉన్నాయి. మొత్తం ద్విచక్ర వాహనాల్లో.. ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో ఉన్నవాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2021 సెప్టెంబరు 1 నుంచి 2026 సెప్టెంబరు 1 వరకు రాష్ట్రంలో 30,83,872 మోటారు సైకిళ్లు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అదే సమయంలో కేవలం 12,530 ద్విచక్ర వాహనాలు ట్రాన్స్‌పోర్టు కేటగిరీలో నమోదయ్యాయి. అంటే ఐదేళ్లలో ట్రాన్స్‌పోర్టు కేటగిరీలోకి వచ్చే బైక్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తాజాగా బైక్ ట్యాక్సీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్యపై చర్చ మొదలైంది.
ఈ వార్తలనూ చదవండి:

