Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవి నుంచి వైదొలగనున్నట్టు వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ ప్రకటన

పదవి నుంచి వైదొలగనున్నట్టు వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ ప్రకటన

వాషింగ్టన్ డీసీ, జూన్ 7: వైట్‌హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) విధాన సలహాదారు(Senior White House Policy Advisor on AI)గా వ్యవహరిస్తున్న భారత సంతతి ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్(Sriram Krishnan) కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ జూన్ ఆఖరున ఆయన వైట్‌హౌస్‌లోని తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 నెలలుగా వైట్‌హౌస్‌లో అమెరికా టెక్నాలజీ విభాగంలో కీలక పాత్ర పోషించిన శ్రీరామ్.. అమెరికా ప్రజలకు సేవ చేయడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రంప్ నాయకత్వంపై ప్రశంసలు..

'ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం లేకపోతే AI రేసులో అమెరికా ఈ రోజు ముందంజలో ఉండేది కాదు. ఆయన కింద పనిచేయడం నాకొక అద్భుతమైన గౌరవం' అని శ్రీరామ్ కృష్ణన్ కొనియాడారు. వైట్‌హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్(Kush Desai) మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను పక్కనపెట్టి వచ్చిన శ్రీరామ్.. సాంకేతికత, ఆవిష్కరణలలో అమెరికా ఆధిపత్యాన్ని చాటడానికి ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ఓ కీలక ఆస్తిగా నిలిచారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ కృష్ణన్ తన 18 నెలల పదవీ కాలంలో అమెరికన్ AI వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి చేసిన కొన్ని ముఖ్యమైన పనులను ప్రస్తావించారు.

అమెరికన్ AI యాక్షన్ ప్లాన్: అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీపై నిబంధనలను సరళీకృతం చేయడానికి, దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల విస్తరణకు మద్దతిచ్చేలా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని చెప్పారు.

నేషనల్ AI పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్: AI రంగంలో రాష్ట్రాలు సొంతంగా నిబంధనలు విధించే పరిమితులను పర్యవేక్షిస్తూ, దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధానాన్ని తెచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్టు వెల్లడించారు.

AI యాక్సిలరేషన్ భాగస్వామ్యాలు: గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ AI స్టాక్ విజయం సాధించడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలు నెలకొల్పినట్టు తెలిపారు.

అంతర్జాతీయ సదస్సులలో ప్రాతినిధ్యం: ఫ్రాన్స్, భారత్‌లో జరిగిన AI సమిట్‌లతో పాటు యూకే, పశ్చిమాసియా దేశాల పర్యటనల ద్వారా మిత్రదేశాలతో అమెరికా AI వ్యూహాలను పంచుకోవడం గురించి శ్రీరామ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

తోటి అధికారులకు కృతజ్ఞతలు:

18 నెలలుగా తనతో కలిసి పనిచేసిన వైట్‌హౌస్ AI సమన్వయకర్త డేవిడ్ శాక్స్(David Sacks)కు శ్రీరామ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్(JD Vance), టెక్ దిగ్గజం ఎలన్ మస్క్(Elon Musk), వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, ఇతర క్యాబినెట్ సెక్రటరీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన భార్య ఆర్తి రామమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

భవిష్యత్తు ప్రణాళికలు..

వైట్‌హౌస్ నుంచి తప్పుకొన్న తర్వాత కొన్నిరోజుల పాటు విరామం తీసుకోనున్నట్లు శ్రీరామ్ తెలిపారు. ఆ తర్వాత అమెరికా, దాని మిత్రదేశాలు AI రంగంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లైన ఎనర్జీ కొరత, డేటా సెంటర్లు, ప్రజలకు AI ప్రయోజనాలను చేరవేయడం వంటి కఠినమైన సమస్యలపై పనిచేసేందుకు కొత్త సంస్థలను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, శ్రీరామ్ ప్రారంభించబోయే ఈ కొత్త ప్రాజెక్టులో కూడా తాము కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వైట్‌హౌస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీరామ్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వానికి 'అవుట్‌సైడ్ అడ్వైజర్'గా సాంకేతిక విషయాల్లో తన సహకారాన్ని అందిస్తూనే ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy