Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదేళ్ల పాటు శ్రమించిన యాపిల్.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణ!

పదేళ్ల పాటు శ్రమించిన యాపిల్.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణ!

ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని గంటల్లో యాపిల్ కొత్త ఐఫోన్‌ను ప్రపంచం ముందుకు రానుంది. ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే క్షణం ఇది. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంస్థ సీఈఓ జాన్ టర్నస్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్ ఉండబోతోందని సంస్థ ఇప్పటికే పేర్కొంది. దీంతో, ఫోల్డబుల్ ఐఫోన్‌ ప్రపంచం ముందుకు రానుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఫోల్డబుల్ ఫోన్‌పై టిమ్ కుక్ ఆసక్తి..

2016 నుంచే ఫోల్డబుల్ పరికరాలపై యాపిల్ దృష్టిపెట్టినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జాన్ టర్నస్‌కు ముందు యాపిల్‌కు నేతృత్వం వహించిన టిమ్ కుక్ సంస్థ ఆదాయాన్ని, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి బాధ్యతలను ఇంజినీర్లకే వదిలిపెట్టారు. అయితే, 2020 నాటి ఆసియా పర్యటనతో ఫోల్డబుల్‌ ఫోన్‌పై కుక్‌కు మక్కువ పెరిగిందని చెబుతారు. ఆసియా మార్కెట్లలో విక్రయమవుతున్న ఫోల్డబుల్‌ ఫోన్లను చూసిన ఆయన యాపిల్‌ కూడా ఈ తరహా మోడల్స్‌పై దృష్టి పెట్టాలని కుక్ భావించారు. ఆ దిశగా సంస్థను ప్రోత్సహించారు.

మీడియా కథనాల ప్రకారం, దశాబ్దకాలం క్రితం యాపిల్ ఇంజినీర్లు ఫోల్డబుల్ ఐప్యాడ్‌ అభివృద్ధిపై పని మొదలెట్టారు. కానీ కుక్ చొరవతో యాపిల్ దృష్టి ఫోల్డబుల్ ఫోన్ వైపు మళ్లింది. ఈ ఫోన్ అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంపై సంస్థ తమ పూర్తి శక్తియుక్తులను కేంద్రీకరించింది.

సంస్థ ముందు నాలుగు సవాళ్లు..

యాపిల్ సంస్థలోని హార్డ్‌వేర్ విభాగం హెడ్ డాన్ సారథ్యంలో ఫోల్డబుల్ ఫోన్ ప్రాజెక్టు ప్రారంభమైంది. వీ68గా దీనికి నామకరణం చేశారు. ఆ తరువాత కుక్, టర్నస్ కూడా ఈ వైపు దృష్టిసారించడంతో ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. ఈ సందర్భంగా యాపిల్ టీమ్ నాలుగు ప్రధాన సవాళ్లపై దృష్టిసారించింది. ఫోన్‌ను మడతపెట్టే సమయంలో స్క్రీప్‌ మధ్యలో కనిపించే సన్నని క్రీజ్‌ను వీలైనంత వరకూ కనిపించకుండా చేయడంపై వారు దృష్టిసారించారు. అంతేకాకుండా ఫోన్ రెండు భాగాలను కలిపి ఉంచే హింజ్ భాగాన్ని మరింత దృఢంగా మార్చారు. కెమెరా వ్యవస్థకు సంబంధించిన భాగాలను ఫోన్ వెనుకవైపు అమర్చేందుకు వీలుగా కొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు. డిస్‌ప్లే కోసం వీలైనంత స్క్రీన్ స్పేస్ అందుబాటులోకి వచ్చేలా చేశారు.

ఇందుకోసం యాపిల్ టైటానియం-అల్యూమినియం హింజ్ వ్యవస్థతో పాటు కోర్నింగ్ సంస్థ సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన కవర్ గ్లాస్‌ను ఉపయోగించినట్టు సమాచారం. దీంతో, ఫోన్ క్రీజ్‌ను ఇతర మోడల్స్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా డిజైన్ చేయగలిగామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక పెద్ద స్క్రీన్‌కు అనువుగా సాఫ్ట్‌వేర్‌లో కూడా యాపిల్ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఐఓఎస్‌లో సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఫోన్ నాణ్యతకు పెద్ద పీట వేయడంతో మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందని సంస్థ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కెమెరా వ్యవస్థ వంటి ఫీచర్లలో కొంత రాజీ పడినప్పటికీ జనాలు ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను ఆదరిస్తారని కంపెనీ బలంగా విశ్వసిస్తోంది.

ధరలపై సుదీర్ఘ మంతనాలు..

ఫోన్ ధర ఖరారు చేసే విషయంలో కూడా యాపిల్ అనేక తర్జనభర్జనలు పడినట్టు సమాచారం. ఫోన్ ధరను 2 వేల డాలర్ల దిగువకే సెట్ చేయాలని మొదట భావించారు. ఆ తరువాత 2,100 డాలర్ల వరకూ ధర ఉండవచ్చా? అనే అంశం కూడా చర్చకు వచ్చింది. ముఖ్యంగా మెమరీ చిప్‌ల కొరత నేపథ్యంలో ధరల విషయంలో యాపిల్ పలుమార్లు ఆలోచించాల్సి వచ్చింది. అధిక స్టోరేజీ ఉన్న ఫోల్డబుల్ ఫోన్లు 3 వేల డాలర్ల పలికే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఫోన్ లోపలి 7.8 అంగుళాల స్క్రీన్, వెనక వైపు 5.5 అంగుళాల స్క్రీన్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఫోన్‌ను మడత పెట్టినప్పుడు చేతిలో ఇమిడిపోయేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు సమాచారం. అయితే, డిజైన్, ధరలు, కెమెరా ఫీచర్ల వంటివన్నీ తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటల ఆగాల్సిందే.

ఈ వార్తలనూ చదవండి:

మొబైల్ ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ కావాలంటే.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి.!

ఈ చొక్కా వేసుకుంటే.. AI, CCTV కెమెరాలు కూడా మిమ్మల్ని గుర్తించలేవట.!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy